తెలంగాణలో ఎన్నికలకు ముందు ఓ సంచలన స్కాం వెలుగులోకి రాబోతోంది. ముఖ్యమంత్రి సహాయనిధి కింద.. రూ. వందల కోట్ల గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వేల సంఖ్యలో చెక్కులు మంజూరు చేశారు. వందల కోట్లు… ఆ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నారు. కానీ వారు ఎవరు..? వారికి ప్రభుత్వం ఏ కారణంగా సాయం చేసింది..?. ఆ రిలీఫ్ పొందిన వాళ్లు.., ఆ డబ్బులను ఎలా ఖర్చు పెట్టుకున్నారు..? లాంటి బేసిక్ వివరాలేమీ ప్రభుత్వం వద్ద లేవు. ఓ ఆర్టీఐ కార్యకర్త… చేసిన ప్రయత్నంలో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. 2014 జూన్ నుంచి 2015 ఆగస్టు వరకు.. తెలంగామ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 12,462 చెక్కులు మంజూరు చేసింది. ఈ చెక్కులను చూపి.. రూ. 86.6 కోట్లను డ్రా చేసుకున్నారు. ఈ చెక్కులన్నీ ఎవరు తీసుకున్నారో కానీ.. కేవలం 182 చెక్కులకు సంబంధించిన సమాచారం మాత్రమే ప్రభుత్వం వద్ద ఉంది. మిగతా సొమ్ములు ఎవరికి ఇచ్చారో ప్రభుత్వానికే క్లారిటీ లేదు.
సాధారణంగా ముఖ్యమంత్రి సహాయనిధి అంటే… అత్యంత నిరుపేదల వైద్య సాయానికి ముఖ్యమంత్రి విచక్షణతో చేసే సాయం కోసం… ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాల కిందకు రాని.. అరుదైన.. ఖరీదైన వ్యాధుల బారిన పడిన వారికి.. ఈ నిధి నుంచి సాయం చేస్తారు. అలాగే.. ముఖ్యమంత్రి విచక్షణ మేరకు.. ఇతర సమస్యల్లో ఉన్న వారికీ ఈ నిధి నుంచి సాయం చేస్తారు. అయితే… ఈ సాయం ఆషామాషీగా చేయడానికి ఉండదు. దానికో లెక్క ఉంటుంది. నేరుగా నిధులు ఇవ్వరు. ఏ ఆస్పత్రిలో చూపించుకుంటున్నారో.. వారికి మాత్రమే బిల్లు చెల్లిస్తారు. దానికీ ఓ ప్రాసెస్ ఉంటుంది. ప్రతీది రికార్డెడ్‌గా ఉండాలి. కానీ తెలంగాణలో మాత్రం.. ఎవరికి సాయం చేశారో తెలియకుండానే..నిధులు మంజూరు చేసేశారు. కొద్ది రోజుల క్రితం.. మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఓ ట్వీట్ చేశారు. 46 నెలల్లో… లక్షా ఇరవై వేల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం చేశామని.. ఇందు కోసం రూ. 800 కోట్లు ఖర్చు చేశామని.. ఆ ట్వీట్ సారాంశం. దీనిపై సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం జరిగింది. పేదల్ని ఆదుకున్నారని అభినందించారు. చాలా మంది సినీ తారలు… ఈ కారణంగానే ముఖ్యమంత్రి సహాయనిధికి.. విరాళాలు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అసలు ఇలా మంజూరు చేసిన.. సాయం ఎవరికి పోయిందో తెలియకుండా… పోవడంతో… విమర్శలు ప్రారంభమయ్యాయి.
ఈ సొమ్మంతా ఎటు పోయిందో తేల్చాలనే డిమాండ్లు ప్రారంభమయ్యాయి. ఆర్టీఐ కార్యకర్త బయటపెట్టిన ఈ వ్యవహారరం జాతీయ మీడియాలోనూ సంచలనాత్మకం అవుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే.. ఈ స్కాంను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయింది. ఆపన్నుల పేరుతో.. ముఖ్యమంత్రి సహాయనిధి సొమ్ము అంతా… సీఎం ఆఫీస్ సాక్షిగా కాజేశారని.. ఆరోపణలు ప్రారంభించింది. దీనిపై విచారణకు డిమాండ్ చేస్తోంది. నిజానికి ప్రభుత్వం తరపున విడుదలయ్యే ప్రతి పైసాకు లెక్క ఉంటుంది. కానీ.. కొన్ని వందల కోట్లకు.. అదీ నేరుగా.. ముఖ్యమంత్రికి సంబంధం ఉన్న నిధులకు… లెక్కలు లేకపోవడం.. ఎన్నికలకు ముందు చాలా పెద్ద వివాదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.