బండ్ల గణేష్ అనే వ్యక్తి నేరుగా రాహుల్ గాంధీతో ఎలా కండువా కప్పించుకున్నాడు..? రాహుల్ పాల్గొనే సభల్లో మాట్లాడే చాన్స్ ఎలా పొంద గలుగుతున్నాడు..? టిక్కెట్ రేసులో ఉన్నానని ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసులో ఎలా లాబీయింగ్ చేసుకోగలుగుతున్నాడు..? .. ఇది కాంగ్రెస్ పార్టీలోనే చాలా మందికి పజిల్‌గా మారిన విషయం. గతంలో..ఓ కాంగ్రెస్ పార్టీ నేతకు బినామీ అంటూ ప్రచారం జరిగినా.. ఇప్పుడా నేత… కాంగ్రెస్ పార్టీలో లేరు. మరి బండ్ల గణేష్‌ను ఎవరు కాంగ్రెస్ పార్టీలో ప్రొత్సహిస్తున్నారు…? అర్థం పర్థం లేకుండా పరువు తీసేలా మీడియాకు ఇంటర్యూలు ఇస్తూ… పార్టీ వేదికలపై మాట్లాడినా.. కనీస జ్ఞానం కూడా ప్రదర్శించని.. బండ్ల గణేష్‌కు కాంగ్రెస్ ఎందుకు ప్రయారిటీ దక్కుతోంది..? . ఈ అనుమానాలన్నింటికీ సమాధానం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కి దగ్గరగా ఉన్న నేతలతో… అత్యంత సన్నిహిత సంబంధాలున్న ఓ తెలుగు మీడియా చానల్ అధినేత… బండ్ల గణేష్‌కు గాడ్ ఫాదర్ గా వ్యవహరిస్తున్నట్లు.. ఇప్పుడిప్పుడే.. రాజకీయవర్గాల్లో క్లారిటీ వస్తోంది. ఈ తెలుగు చానల్లో కాంగ్రెస్ పార్టీ నేతకు… వాటాలు కూడా ఉన్నాయి. అసలు దక్షిణాది రాజకీయాలకు సంబంధం లేదు కానీ.. కాంగ్రెస్ వ్యవహారాలను కొన్నాళ్లు పర్యవేక్షించారు. ఆ సమయంలో… సదరు టీవీ చానల్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నారు. చానల్లో కొన్ని షేర్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ చానల్ యజమానికి తెలంగాణ కాంగ్రెస్‌లో తన మనుషులుంటూ కొంత మందిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. అప్పటికీ.. ఓ కీలక నేతతో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ.. వర్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సొంత ఆలోచనలు అంటూ లేని బండ్ల గణేష్ ను ఆయన ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీతో సన్నిహితంగా ఉండే… సదరు టీవీ చానల్ ఓనర్‌కి బండ్ల గణేష్ గతంలోకాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే మంచి పరిచయం ఉంది. బండ్లను ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చన్న ఫ్లెక్సీబులిటీ ఉండటంతో.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏకంగా టిక్కెట్ కోసం.. రేసులోకి తెచ్చి పెట్టారట..!
మామూలుగా అయితే.. బండ్ల గణేష్ మాట్లాడే మాటలకు.. ఎవరూ.. కనీసం పార్టీ తరపున మైక్ కూడా పట్టుకోనీయరు. అంతగా కామెడీ చేస్తారు. అలాంటిది తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయనో ప్రముఖ నేతగా చెలామణి అయిపోతున్నారు. నేరుగా చంద్రబాబును కలిసి.. నేను ఫలానా స్థానం టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు. దాన్ని టీడీపీ కోసం అడగకుండా అని విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు. బండ్ల వ్యవహారం.. ఇతర కాంగ్రెస్ నేతలకు చిరాకు తెప్పిస్తోంది. కానీ ఎవరూ ఏమీ అనలేకపోతున్నారు. దానికి కారణం సదరు టీవీ చానల్ ఓనర్.. ఆ ఓనర్‌కి… ఢిల్లీ స్థాయి కాంగ్రెస్ నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలే. ఎలా అయినా.. బండ్లకు ఓ టిక్కెట్ ఇప్పించాలని.. సదరు చానల్ ఓనర్ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. మరి సక్సెస్ అవుతారో లేదో మరి..!