సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి సంబంధించి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తాజాగా చాలా తీవ్రంగానే స్పందించారు. ఈ మరణాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయంటూ ఆయన దెప్పిపొడిచారు. రోహిత్ మరణానికి సంబంధించిన అసలు కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదంటూ వెంకయ్యనాయుడు ఓ మాట చెప్పారు. ఇది చాలా కీలకమైన విషయం. అయితే ఇక్కడే అసలు మతలబు ఉంది.
పిల్లి మెడలో గంట కట్టేదెవరు? రోహిత్ మరణం వెనుక అసలు వాస్తవాలు ఏమిటో శోధించి తెలుసుకోవాల్సింది ఎవరు? రోహిత్ కులంగురించి రకరకాల వివాదం ఉంది. అయితే రోహిత్ తనను ఎస్సీగా క్లెయిం చేసుకోవడంతో తొలినుంచి దళిత విద్యార్థి ని పొట్టన పెట్టుకున్నారన్నట్లుగా యాగీ చేసిన వారంతా, రోహిత్ తండ్రి బీసీ అని తేలడం, అతను బీసీ అవుతాడని తేలడంతో… రోహిత్ అంత దుర్మార్గంగా మరణించిన తర్వాత.. అతని కులంతో పనేమిటంటూ కొత్త పాట అందుకున్నారు. ఇలాంటి పోకడలు చాలా స్పష్టంగా ఈ దుర్ఘటనను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయనే సంగతినే బోధపరుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ మరణం వెనుక అసలు కారణాలు ఏమిటో తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పింది అక్షర సత్యం.
అయితే ముందే అనుకున్నట్లు.. ఈ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? దుర్ఘటన జరిగింది సెంట్రల్ యూనివర్సిటీలో! జరిగిన వెంటనే కేంద్రం స్పందించి.. దీని వెనుక ఉన్న వాస్తవాల్ని నిగ్గు తేల్చడానికి ఓ కమిటీ వేసి ఉంటే ఇంత రగడకు ఆస్కారం ఉండేది కాదు. ఈ వ్యవహారంలో న్యాయవిచారణకు ఆదేశించిన కేంద్ర సర్కారు అదైనా సత్వరం పూర్తి కావడంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఒక డెడ్‌లైన్ పెట్టి.. ఆలోగా అసలు మరణానికి దారితీసిన పరిస్థితులేమిటో తేల్చాలి. నిజానికి రోహిత్ ఆత్మహత్యను కేంద్రం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ఒక పాఠంగా తీసుకోవాలి. భవిష్యత్తులోనైనా ఇ లాంటి దుర్ఘటనలు సంభవించినప్పుడు, అవి రాజకీయ రంగు పులుముకోగల ప్రమాదం ఉన్నప్పుడు ప్రభుత్వాలే ముందుగా స్పందించి.. విచారణకు ఆదేశించడం అవసరం. అందువల్ల.. ఆధారాలు మాయం కాకముందే విచారణ సాధ్యం అవుతుంది. ఆ విషయంలో కేంద్రం చేసిన జాప్యానికి చింతిస్తూ.. తర్వాతి చర్యలు తీసుకోవడంపై వెంకయ్య కదలిక తీసుకువస్తే బాగుంటుంది.