గుజరాత్లో నర్మదా తీరంలో ప్రధాని మోడీ దేశ తొలి హొం మంత్రి ఉప ప్రధాని సర్దార్ పటేల్ విగ్రహం ఆవిష్కరించారు. దానికి ముందే మీడియాకు నివాళి వ్యాసం పంపిన మోడీ ప్రసంగంలోనే అవే ప్రస్తావనలు చేశారు. బిజెపి ఆరెస్సెస్‌లు సర్దార్ పటేల్‌ను పొగుడుతూ నెహ్రూ వారసత్వానికి గ్రహణం పట్టించాలని చూస్తుంటారు. అయితే వారు మరుగుపర్చే చరిత్ర ఏమంటే పటేల్ ఆరెస్సెస్ తరహా మత రాజకీయాలకు పూర్తి వ్యతిరేకం. 1948 జనవరి 30గాంధీజీ హత్య తర్వాత చాలా తీవ్ర భాషలో ఆయన ఆరెస్సెస్‌ను విమర్శించారు. దానిపై పటేల ప్రధాని నెహ్రూకు 1948, ఫిబ్రవరి 27వ తేదీన రాసిన లేఖ ఇలా వుంది.
‘సావర్కార్ నేతృత్వంలో హిందూత్వ మితవాద సంస్థ అయిన ‘హిందూ మహాసభ’ నేరుగా కుట్ర పన్ని అమలు చేసింది. కుట్రలో పది మంది వరకు వున్నట్టు కనిపిస్తోంది. గాంధీ ఆలోచనలను, విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభకు చెందిన వారు ఆయన హత్యను స్వాగతించారు కూడా…’
గాంధీజీ హత్యకు ఆర్ఎస్ఎస్ ఇతర హిందూత్వ సంస్థలతో కలిసి కుట్ర పన్నిందంటూ 1948, ఫిబ్రవరి 4వ తేదీన దాన్ని నిషేదించారు. . నిషేధపు ఉత్తర్వులో అందుకుగల కారణం చాలా స్పష్టంగా వుంది.
‘సంఘ్ సభ్యులు అవాంఛనీయ, ప్రమాదకర కార్యకలాపాలకు పాల్పడ్డారు. దేశంలోని పలు ప్రాంతాలలో గృహ దహనాలు దోపిడీ, దొంగతనం, హత్య, అక్రమ ఆయుధాలు-మందుగుండు సామగ్రి సమీకరణ..వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. అంతేగాక, తీవ్రవాద పద్ధతులను ఆశ్రయించేందుకు, మందుగుండు సామగ్రిని సేకరించేందుకు, ప్రభుత్వంపై విద్వేషాన్ని సృష్ట్టించేందుకుగాను ప్రజలను రెచ్చగొట్టే కరపత్రాలను సైతం పంపిణీ చేశారు’ అప్పటి ఆర్ఎస్ఎస్ అధిపతి గోల్వాల్కర్‌కు సర్దార్ పటేల్ రాసిన లేఖ దీనిని మరింత రూఢి పరచింది.
‘వారి ప్రసంగాలన్నీ మతోన్మాద విషంతో నిండి వున్నాయి. హిందువులను ఉత్తేజితులను చేసి వారి రక్షణ కోసం సన్నద్ధం చేయాలంటే ఈ విషపూరిత బోధలు అవసరం లేదు. వీటి మూలంగా దేశం అమూల్యమైన గాంధీజీ ప్రాణాలను పోగొట్టుకోవలసివచ్చింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్కు ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి అణుమాత్రం కుసానుభూతి కూడా మిగలలేదు. వాస్తవానికి దానిపై వ్యతిరేకత మరింత పెరిగింది. గాంధీజీ మరణానంతరం మిఠాయిలు పంచుకుని తమ సంతోషాన్ని వెలిబుచ్చడంతో ఆర్ఎస్ఎస్ వారి పట్ల ఈ వ్యతిరేకత ఇంకా తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అనివార్యంగా ఆర్ఎస్ఎస్పై చర్య తీసుకోవలసి వచ్చింది. అప్పటి నుంచి ఆరు మాసాలు పైగా గడిచిపోయాయి. ఈ కాలంలో ఆర్ఎస్ఎస్ వారు సరైన మార్గంలోకి వస్తారేమోనని చాలా జాగ్రత్తగా బాధ్యతగా పరిశీలిస్తున్నాం. మేమంతా కానీ నాకు అందిన నివేదికలను చూసినప్పుడు వారు తమ పాత కార్యకాలపాలనే తిరిగి చేపట్టే ప్రయత్నాల్లో వున్నట్టు తేలింది’.’ఆర్ఎస్ఎస్-హిందూ మహాసభ చెప్పే ప్రకారం గాంధీజీ హత్యకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో వుంది. అందువల్ల ఆ రెండు సంస్థల పాత్రకు సంబంధించి నేనేమీ మాట్లాడకూడదు. అయితే, ఆ రెండు సంస్థలు మరీ ముఖ్యంగా మొదటిది చేపట్టిన కార్యకలాపాల కారణంగా దేశంలో ఇటువంటి భయానక సంఘటన సాధ్యమైందని మాకు అందిన నివేదికలు చెప్తున్నాయి. ఈ కుట్రలో హిందూ మహాసభకు చెందిన అతివాదులు కొందరు పాల్గొన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ప్రభుత్వం, రాజ్యం ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టాయి. నిషేధం తర్వాత కూడా వారి చర్యలు ఆగలేదు. వాస్తవానికి, సమయం గడిచేకొందీ, ఆర్ఎస్ఎస్ విభాగాలు మరింత ధిక్కార ధోరణితో, మరింత ఎక్కువగా విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాయి.’
1992 డిసెంబరు 6 వ తేదీన అయోధ్యలో మసీదును కూల్చివేసేందుకు ఆర్ఎస్ఎస్ ఇలాటి పాచికలే వేసింది. ఈ కేసు సుప్రీం కోర్టు ముందుకొచ్చినపుప్పడు మసీదు కట్టడాన్ని తాకబోమని ఆ కోర్టుకు హామీ నిచ్చింది. వాస్తవంలో సంఘ పరివార్ మసీదును కూల్చివేసింది. అప్పటి ప్రధాని పివి నరసింహారావుకు దాన్ని నమ్మి మోసపోయారన్నారు. విశేషమేమంటే అయోధ్యలో వివాదాస్పద స్థలానికి తాళాలు వేసేలా అప్పటి యుపి ముఖ్యమంత్రి గోవిందపంత్కు గట్టిగా లేఖ రాసింది కూడా సర్దార్ పటేలేక్ష్మి ఇవన్నీ చరిత్రలో నమోదైన వాస్తవాలే. అయితేనేం.. పటేల్ చిత్రం ముందుంచుకుని రాజకీయ లబ్ది పొందాలన్నది బిజెపి ప్రస్తుత వ్యూహం. దాని మాతృసంస్థ ఆరెస్సెస్ అందుకు పూర్తి ఆశీర్వాదమిచ్చింది. ఇవన్నీ చెప్పడానికి రాతి విగ్రహంలోంచి పటేల్ ఎలాగూ రారు!