‘ఎన్టీఆర్’ బయోపిక్‌ని రెండు భాగాలుగా తీద్దామన్న నిర్ణయం.. బాలకృష్ణలోని తెలివితేటలకు నిదర్శనం. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత అన్న సంగతి తెలిసిందే. ఒక బయోపిక్, రెండు భాగాలు, రెండింతల లాభం. ఇదీ ఆయన ప్లాన్. అయితే… ఒకే సినిమాని రెండు భాగాలుగా తీసి, రెండు సార్లు అమ్ముకుంటున్నప్పుడు .. రెండేసి పారితోషికాలు ఇవ్వాలిగా.?? ప్రస్తుతం చిత్రబృందంలో అదే చర్చ నడుస్తోంది. ఈ సినిమాకి పని చేసిన వాళ్లంతా ‘మాకు అదనంగా పారితోషికం కావాల్సిందే’ అని డిమాండ్ చేశారని ఇన్సైడ్ వర్గాల నుంచి అందింన సమాచారం..
నిజానికి ఈ సినిమాని రెండు భాగాలుగా తీయాలన్న ఆలోచన క్లాప్ కొట్టేటప్పుడు లేదు. నటీనటుల్ని ఎంపిక చేసుకుని, వాళ్ల కాల్షీట్లు సర్దుబాటు చేసుకున్నాకే… రెండు భాగాలన్న ఆలోచన వచ్చింది. ఈ ఐడియా కూడా క్రిష్‌దేనని తెలుస్తోంది. ‘రెండు భాగాలు’ వల్ల వచ్చే అదనపు ప్రయోజనం అర్థమైన బాలకృష్ణ క్రిష్ ఐడియాకు ఓకే చెప్పేశాడు. దాంతో పనులన్నీ ముమ్మరంగా సాగిపోయాయి. అయితే.. అంతకు ముందే పారితోషికాలన్నీ సెటిల్ అయిపోయాయి. ఎవరికి ఎంత ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. దానికి అందరూ అంగీకరించి సంతకాలు పెట్టేశారు. అయితే ఎప్పుడైతే రెండు భాగాలు అని తెలిసిందో.. అప్పుడు ‘మరి పారితోషికాల మాటేంటి?’ అనే ప్రశ్న ఎదురైందని సమాచారం. ఈ సినిమాలో నటిస్తున్న కొంతమంది సీనియర్ నటీనటులు కొంతమంది ఈ విషయాన్ని క్రిష్ దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దాన్ని బాలయ్య ముందుకు తీసుకెళ్లాడట క్రిష్. రెండు పారితోషికాలు ఇవ్వడం అనే ప్రతిపాదనని సానుకూలంగా తీసుకున్న బాలయ్య… మధ్యేమార్గంగా పారితోషికాల్లో 50 శాతం పెంపుకు అంగీకరించాడని తెలుస్తోంది. ఉదాహరణకు క్రిష్ ఓ సినిమాకు రూ.5 కోట్లు తీసుకున్నాడనుకుందాం. రెండు భాగాలకు రూ.10 కోట్లు ఇవ్వాలి. కానీ రూ.7.5 కోట్లకు సెటిల్ చేశారన్నమాట. అదీ.. ‘ఎన్టీఆర్’ పారితోషికాల లెక్క.