కాంగ్రెస్ పార్టీ.. సీపీఐని.. చాలా తేలిగ్గా తీసుకుంటుంది. రెండు, మూడు సీట్లు అంటూ లీకులు ఇచ్చి చివరికి అవి కూడా.. ఏ మాత్రం బలం లేని స్థానాలు కేటాయిస్తుందనే ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పోటీ చేయాలనుకోంటోన్న స్థానాలను సీపీఐ కూడా ఆశిస్తోంది. దీంతో ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అంశంపై ఆ రెండు పార్టీల్లో తీవ్ర చర్చకు కారణమవుతోంది. ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై క్లారిటీ వచ్చినా.. పోటీ చేసే స్థానాలవిషయంలో కూటమి పార్టీలో స్పష్టత రావటం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ సీపీఐ లు కొన్ని స్థానాల విషయంలో పట్టు వీడటం లేదు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గాలను రెండు పార్టీలు ఆశిస్తున్నాయి.
ఈ రెండు స్థానాలను 2014లో టీఆర్ఎస్ గెల్చుకుంది. కొత్తగూడెం సీటును కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆశిస్తున్నాడు. ఇదే స్థానాన్ని సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరుతున్నారు. హుస్నాబాద్ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు.ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఉన్నాడు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నేతల ప్రకటనలతో కొత్తగూడెం, హుస్నాబాద్ స్థానాలపై అయోమయం నెలకొంది. కాంగ్రెస్ గెలిచే స్థానాలను వదులుకోమని స్వయంగా ఆపార్టీ నేతలే ప్రకటిస్తున్నారు. దీంతో సీపీఐ అడుగుతోన్న స్థానాలను .. కాంగ్రెస్ ఇస్తామంటోన్న స్థానాలపై క్లారిటీ మిస్ అవుతోంది. దేవరకొండ, బెల్లంపల్లి, వైరా సీట్లు కూడా కావాలని సీపీఐ అడుగుతోంది. ఇదే విషయాన్ని చాడ వెంటరెడ్డి బుధవారం జరిగిన సమావేశంలో ఎల్.రమణ, కోదండరాం దగ్గర ప్రస్తావించారు.
మరో వైపు సీపీఐకు నాలుగు స్థానాలిస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమర్ రెడ్డి లీకులివ్వడంపై కూడా చాడ వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చూస్తూంటే.. చివరికి సీపీఐకి… తను కోరుకున్న స్థానాలు కాకుండా.. అవకాశాల్లేని చోట్ల సీట్లను ఖరారు చేస్తారేమోనన్న టెన్షన్ పట్టుకుంది.