మహాకూటమి పొత్తుల ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్, టీడీపీ ఆశావహులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాలపై కూటమి పెద్దలకు ఒక స్పష్టత వచ్చింది. కాంగ్రెస్‌పార్టీకే ఈ సీట్లు కేటాయిస్తున్నారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, నర్సంపేట, పరకాల నియోజకవర్గాలపైనే మహా కూటమి మల్లగుల్లాలు పడుతోంది. ఆయా స్థానాల్లో మిత్రపక్ష పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఎటూ తేల్చు కోలేకపోతున్నారు. ప్రధానంగా మహాకూటమి రాజకీయాలు అన్నీ నర్సంపేట నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి. టీడీపీ.. ఉమ్మడి జిల్లా నుంచి ఒక సీటు అడుగుతోంది. అది కూడా నర్సంపేట కావాలని పట్టుబడుతోంది. మొదటి నుంచి చంద్రబాబు నాయుడితో సన్నిహితంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి కోసం సీటు అడుగుతున్నారు. ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కోసం రెండు పార్టీల అధినేతలు చర్చలు జరిపినా.. ఫలితం లేదు.
ఇద్దరిలో ఒకరు పరకాల, ఇంకొకరు నర్సంపేట నుంచి పోటీ చేయాలన్న సూచనలు చేశారు. తనకు నర్సంపేట తప్ప మరొకటి వద్దని ప్రకాష్‌రెడ్డి ఖరాఖండీగా చెప్పారు. తన సీటును ఎక్కడ త్యాగం చేయాల్సి వస్తుందోనని దొంతి మాధవరెడ్డి ఢిల్లీకి వెళ్లారు. తన సీటుకు ఢోకా లేకుండా లాబీయింగ్ చేసుకున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో.. దొంతి మాధవరెడ్డి ఇండిపెండెంట్ గా గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్ని ఆఫర్లు వచ్చినా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఎర్రబెల్లి, కడియం లాంటి నేతలు పార్టీని వీడినా రేవూరి మాత్రం టీడీపీతోనే ఉన్నారన్న భావన చంద్రబాబుకు ఉంది. అందుకే రేవూరి కోసం చంద్రబాబు కూడా నర్సంపేటను పట్టుబడుతున్నారు. రేవూరి మెత్తపడితే టీడీపీకి పరకాల కేటాయించాలనే ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఇటీవల టీఆర్ఎస్పార్టీ నుంచి తిరిగి సొంత గూటికి చేరిన కొండా దంపతులు పరకాల మీద గురి పెట్టారు. ఇప్పుడు వాళ్లను తూర్పు నుంచి పోటీ చేయాలనే సూచనలు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వస్తున్నాయి. కానీ వాళ్లు మాత్రం పరకాలకే ఫిక్సయిపోయారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని తొలుత టీజేఎస్ కేటాయిస్తారని, ఆ తర్వాత టీడీపీకి కేటాయించి ప్రకాశ్‌రెడ్డిని ఇక్కడకు పంపిస్తారని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్సే పోటీ చేయనుందని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి తన సహచరుడు వేం నరేందర్‌రెడ్డి కోసం పట్టుబడుతున్నారు. కాంగ్రెస్‌పార్టీ అధిష్టానాన్ని రేవంత్‌రెడ్డి ఏడు సీట్లు తన వాళ్లకు ఇవ్వాలని కోరారు. అందులో వేంనరేందర్‌రెడ్డితో పాటుగా ములుగు నుంచి సీతక్కకు కూడా ఉన్నారు. ములుగులో సీతక్క, పొదెం వీరయ్య నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ఎవరికి వారుగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్నాకే అంటే నాకు అని ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ రాకపోయినా మరొకరు బీజేపీ లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి డిసైడయ్యారు. జాబితా వచ్చే వరకూ ఈ టెన్షన్ ఉంటుంది.