మహా కూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారానికి ఢిల్లీ వేదికగా మారింది. సోనియా గాంధీ నివాసంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం దాదాపు రెండు గంటలపాటు జరిగింది. ఈ చర్చల్లో కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు కేటాయించిన సీట్లపై కూడా తీవ్ర చర్చే జరిగినట్టు తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసే స్థానాల విషయానికొస్తే… రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగానూ, 95 చోట్ల పోటీ చేస్తున్నట్టుగా ఆ పార్టీ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా మీడియాతో చెప్పారు. వీటిలో 62 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసే అంశమై చర్చించామనీ, ఇంతవరకూ 57 మంది పేర్లను ఫైనల్ చేసినట్టు చెప్పారు. అందరి అభ్యర్థులను ఒకేసారి ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఈ నెల 8వ తేదీ సాయంత్రానికి విడుదల చేస్తామన్నారు. 95 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయడం ఖాయమనీ, మిగతా స్థానాలను మిత్రపక్షాల కోసం కేటాయిస్తుందని కుంతియా స్పష్టం చేశారు.
అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… మహా కూటమిపై కూడా అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించామన్నారు. తెలుగుదేశం పార్టీతో 14 సీట్లలో ఇప్పటికే ఒప్పందం కుదిరిందని చెప్పారు. అయితే, టీజేయస్, సీపీఐకి ఎన్నెన్ని సీట్లు కేటాయిస్తామన్న అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. దీనిపై ఇంకా అంతిమ నిర్ణయం పార్టీ తీసుకోవాల్సి ఉందన్నారు.
అయితే, టీడీపీకి 14 అసెంబ్లీ సీట్లు అని కాంగ్రెస్ చెబుతున్నా… ఆ పార్టీ మరో నాలుగు స్థానాలు కావాలని కోరుతున్నట్టుగా సమాచారం. ఇక, కోదండరామ్ పార్టీ టీజేయస్ 12 సీట్లు అడుగుతోంది. కాంగ్రెస్ లెక్క 8 ఇస్తే చాలన్నట్టుగా ఉంది. సీపీఐ 5 సీట్లు అడుగుతోంది. అంతేకాదు, సీపీఐ జాతీయ నేతలు కాంగ్రెస్ సీనయర్ నేత అహ్మద్ పటేల్ ని కలిసి తమకు ఐదు సీట్లు తెలంగాణలో ఇవ్వాలంటూ కోరారు. పార్టీలో ఈ అంశం చర్చించాక వివరాలు తెలియజేస్తామని అహ్మద్ పటేల్ వారికి చెప్పారు. మొత్తానికి, సీట్ల సర్దుబాటు ప్రక్రియ దాదాపు చివరికి వచ్చినట్టే.. టీడీపీ మినహా ఈ రెండు పార్టీలతోనే చర్చలు జరపాల్సి ఉంది. అయితే, 95 స్థానాలు కాంగ్రెస్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి… మిగిలిన ఆ కొద్ది స్థానాల్లో ఈ మూడు పార్టీలు సర్దుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.