ఎన్టీఆర్ బయోపిక్ గురించి చెప్పుకోవడానికీ, మాట్లాడుకోవడానికీ బోలెడన్ని విశేషాలు. ఈ సినిమాలో కీలకమైన పాత్రలు చాలా ఉన్నాయి. వాటిలో ఎవరు కనిపించినా అది వార్తయిపోతోంది. తాజాగా దాసరి నారాయణరావు పాత్రలో దర్శకుడు వినాయక్ నటిస్తారన్న ఓ వార్త బయటకు వచ్చింది. ఎన్టీఆర్ – దాసరి మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలొచ్చాయి. కాబట్టి ఎన్టీఆర్ కథచెబుతూ.. దాసరికి చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పాత్రకు ఎవరైతే బాగుంటుందన్న ఆలోచనలో క్రిష్ చాలా రోజుల నుంచీ ఉన్నారు.
ఇప్పుడు వినాయక్ పేరు బయటకు వచ్చింది.
నిజానికి ఈ పాత్ర కోసం ముందు చంద్రసిద్దార్థ్ని ఎంచుకుందామనుకున్నారు. ఆయన ఓకే కూడా చెప్పాడు. ఎందుకనో క్రిష్ ఆ ఆలోచన నుంచి డ్రాప్ అయ్యారు. అన్నింటికంటే ఆసక్తికరమైన విశేషమేమంటే…. తేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తరవాత.. బాలయ్య చాలామంది దర్శకుల పేర్లు పరిశీలించాడు. అందులో చంద్ర సిద్దార్థ్ కూడా ఉన్నాడు. ఒకవేళ క్రిష్ రాకపోయి ఉంటే.. ఈ ప్రాజెక్టు చంద్రసిద్దార్థ్ చేతిలోకి వెళ్లేది. కానీ `మణికర్ణిక` చిత్రాన్ని వదిలి క్రిష్ ఈ సినిమా పగ్గాలు చేపట్టారు. `దర్శకత్వం పోతే పోయింది.. కనీసం పాత్ర అయినా దక్కింది` అనుకుంటే.. చంద్రసిద్దార్థ్ కి మరోసారి మొండి చేయి ఎదురైంది. అసలు దాసరి లేకుండా ఈ సినిమా పూర్తి చేస్తే ఎలా ఉంటుందన్నది క్రిష్ ఆలోచన. ఇప్పుడు వినాయక్ పేరు బయటకు రావడం కూడా ఉట్టి గాసిప్పే. అందులో ఎలాంటి నిజాలూ లేవని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. సో… సూరేకాంతంలానే, ఎన్టీఆర్ కథలో దాసరినీ చూడలేమన్నమాట.