బస్సు యాత్ర, రైలు యాత్ర, పాద యాత్ర.. ఇవన్నీ పొలిటికల్ పదాలు. జనంలోకి వెళ్లడానికి పార్టీలు, జన నేతలు ఎంచుకునే ప్రత్యామ్నాయాలు. అయితే ఈ యాత్రలు చిత్రసీమకూ వ్యాపించాయి. `విజయయాత్ర` పేరుతో… సక్సెట్ టూర్లు వేస్తున్నారు సినిమావాళ్లు. అయితే రవిబాబు కాస్త కొత్తగా ఆలోచించాడు. సినిమా విడుదలకు ముందే… ఓ పాద యాత్ర మొదలెట్టాడు. అదీ పందితో.
రవిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `అదుగో`. బంటి అనే పంది పిల్ల చుట్టూ నడిచే కథ ఇది. త్రీడీ యానిమేషన్ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రచారాన్ని వినూత్నంగా చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. అందుకే పందితో పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు రవిబాబు. చంకలో పందిని పట్టుకుని, చిత్రబృందంతో సహా రేపు (శుక్రవారం) హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ రౌండ్లు వేయబోతున్నాడు రవిబాబు. ఆ తరవాత ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అప్పుడెప్పుడో నోట్ల రద్దు సమయంలో పందిని పట్టుకుని ఏటీఎమ్ సెంటర్ ముందు నిలబడ్డాడు. ఇది మరో టైపు ప్రచారం అన్నమాట.