మహా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో… తెలంగాణ జన సమితికి ఢిల్లీ కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చినట్టు సమాచారం! ఎందుకంటే, కూటమి పార్టీల సీట్ల పంపకాల వ్యవహారంలో మొదట్నుంచీ కోదండరామ్ పార్టీయే కొంత పట్టుదలతో ఉన్న మాట వాస్తవమే. ఓరకంగా టీడీపీతో కంటే, జన సమితి వ్యవహారమే కాంగ్రెస్ కి కొంత తలనొప్పిగా ఉంటూ వస్తోందని చెప్పొచ్చు. అయితే, 14 సీట్లతో టీడీపీతో ఒప్పందం కుదిరిపోయింది కాబట్టి… ఇక, కోదండరామ్ తో నేరుగా కాంగ్రెస్ హై కమాండ్ చర్చిస్తేనే మంచిదనే ప్రతిపాదన పీసీసీ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది.
జన సమితి ప్రస్తుతం అడుగుతున్న సీట్లు 15. కానీ, కాంగ్రెస్ ఆ పార్టీకి 8 సీట్లు మాత్రమే ఇస్తామని అంటోంది. ఈ బేరసారాల నేపథ్యంలో 12 సీట్ల కంటే తక్కువ అయితే ఒప్పుకునేది లేదనేది కోదండరామ్ పట్టుదలగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి కోదండరామ్ కి ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రాహల్ తో ఆయన భేటీ ఉంటుంది. ఈ భేటీలో కోదండరామ్ ని 8 లేదా 9 సీట్లకు ఒప్పించాలన్నది కాంగ్రెస్ వ్యూహం. అంతేకాదు, తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే… కోదండరామ్ పాత్ర మరింత క్రియాశీలంగా ఉంటుందనే హామీని రాహుల్ ద్వారా ఇప్పించే అవకాశం ఉంది.
జన సమితి విషయంలో ఇంత కసరత్తు ఎందుకు చేస్తోందంటే.. కోదండరామ్ అడుగుతున్నట్టుగా 15 స్థానాలు ఇస్తే… కొన్ని స్థానాల్లో తెరాసకు అనుకూలంగా మారే అవకాశం ఉందనేది కాంగ్రెస్ అభిప్రాయం. కాబట్టి, పట్టువిడుపు ధోరణికి ఇక్కడ ఆస్కారం లేని పరిస్థితి ఉందని కొందరు నేతలు అంటున్నారు. ఇంకోటి.. కోదండరామ్ కి తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపు ఉంది కాబట్టి… నేరుగా రాహుల్ తో మాట్లాడించడం ద్వారా ఆ పార్టీకి కాంగ్రెస్ ఎంత ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాలు కూడా వెళ్తాయనేది వారి ఆలోచన. మొత్తానికి, వ్యవహారం రాహుల్ తో భేటీ వరకూ వచ్చింది కాబట్టి, జన సమితి సీట్ల కేటాయింపు కూడా దాదాపు ఒక కొలీక్కి వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన వ్యూహం మరొకటి ఉంది. కాంగ్రెస్ 95లో పోటీ చేసేయడం ఖాయమనీ, టీడీపీకి 14 ఇస్తున్నామనీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించేసింది. అంటే, మొత్తం 119 స్థానాలకుగానూ 109 సీట్లపై ఒక స్పష్టత ఇచ్చేసినట్టే. మిగిలినవి 10 మాత్రమే. వీటిలోనే జన సమితి, సీపీఐలు సర్దుబాటు చేసుకోవాలనే ఒక అప్రకటిత అభిప్రాయాన్ని రాహుల్ తో చర్చకు ముందే కోదండరామ్ ముందు కాంగ్రెస్ ఉంచినట్టే కదా!