‘అరవింద సమేత వీరరాఘవ’ విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్‌తో ‘దర్శకుడిగా పదహారేళ్లల్లో పది సినిమాలు తీశారు. సినిమాల సంఖ్య తక్కువగా వుంది. ఏడాదికి ఒక్కటి కూడా లేదు. వేగం పెంచాలి’ అన్నారు. అందుకు బదులుగా త్రివిక్రమ్ “ఎందుకండీ.. లెక్కలు చెప్పి నా పరువు తీస్తారు. నేను నిదానంగా తీస్తానని అందరికీ తెలుసు. మళ్లీ గుర్తు చేయడం ఎందుకు? తమన్ అయితే నాకంటే ఆరేడు రేట్లు ఎక్కువ సినిమాలు తీశాడు” అన్నారు. ఇప్పుడీ ప్రస్తావన అంతా ఎందుకంటే… తమన్ వేగం గురించి చెప్పడానికి! ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన సంగీత దర్శకుడు ఎవరన్నా వున్నారంటే అది తమనే! సంగీత దర్శకుడిగా అతను చాలా బిజీ. ఎంత బిజీ అంటే… తను చేస్తున్న సినిమాల సంఖ్య లెక్క పెట్టుకోలేనంత! ఒకవేళ లెక్కపెట్టుకుని వుంటే మంచి ఛాన్స్ మిస్ అయ్యేవాడు కాదు.
ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’కు తమన్ సంగీతం అందించాడు. అదే ఎన్టీఆర్ మాటల్లో అయితే ప్రాణం పెట్టాడు. ‘అరవింద సమేత’కు తమన్ సంగీతం ఇవ్వలేదని, ప్రాణం పోశాడని, అతడు ఎంత కష్టపడ్డాడో తనకు తెలుసనీ ఎన్టీఆర్ గొప్పగా చెప్పారు. నిజం చెప్పాలంటే… ‘అరవింద సమేత’లో ‘పెనివిటి’ పాట విని ప్రేక్షకులు కంటతడి పెట్టుకున్నారు. తమన్ బాణీకి త్రివిక్రమ్ న్యాయం చేయలేదనే విమర్శలూ వచ్చాయి. పాటలతో పాటు కథకు తగ్గట్టు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని ఇచ్చాడు.
ప్రేక్షకులు ప్రత్యేకంగా తమన్ సంగీతాన్ని ప్రశంసించారు. సంగీత దర్శకుడిగా ఇంత పేరు తీసుకొచ్చిన ‘అరవింద సమేత’ తన వందో చిత్రమని తమన్ ఈరోజు ట్వీట్ చేశాడు. ఈ లెక్క ఏదో ముందు పెట్టుకుంటే సినిమాకు సంబంధించిన ప్రతి ఫంక్షన్లోనూ అతడికి స్పెషల్ ట్రీట్మెంట్ దక్కేది. స్పెషల్ ఏవీలు ప్లాన్ చేసేవారు. వేదికలపై అతడిని అందరూ ప్రశంసించేవారు. సన్మానాలు తప్పకుండా వుండేవి. ఏడాదికి పది పది సినిమాల చొప్పున పదేళ్లల్లో వంద సినిమాలు చేయడమంటే మాటలు కాదు.మామూలు విషయం అంతకన్నా కాదు! ప్రశంసలు, విమర్శలు పక్కన పెడితే… విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా పని చేసినందుకు తమన్‌ని అందరూ అభినందించి తీరాలి.