ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. గురువారం మధ్యాహ్నం.. ఢిల్లీలో దిగారు. రాత్రి వరకూ.. ఆయన వరుసగా వివిధ పార్టీల నేతల్ని కలుస్తూనే ఉన్నారు. కూటమిని తాను ఏకతాటిపైకి తెస్తున్నారు కాబట్టే.. స్వయంగా తానే వెళ్లి అందర్నీ కలుస్తున్నారు. ఢిల్లీకి వెళ్లిన వెంటనే శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాలను కలిసిన ఆయన ఆ తర్వాత రాహుల్ గాంధీని కలిశారు. అక్కడ గంటకుపై చర్చలు జరిపిన తర్వాత నేరుగా ఆంధ్రా భవన్ కు వచ్చారు. అక్కడ అరుణ్ శౌలి వచ్చి కలిశారు. ఆ తర్వాత ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ వచ్చి కలిశారు. ములాయం ఇంటికి చంద్రబాబు వెళ్తే.. అక్కడకు అఖిలేష్ వచ్చారు. సీతారాం ఏచూరీని కూడా కలిశారు. ఇలా… గత టూర్‌లో కవర్ చేయని వారందరూ కలిశారు. ఓ రకంగా… బీజేపీని ఢీకొట్టగలిగే… నేత వచ్చాడన్నట్లుగా.. నేతల భేటీలు సాగాయి.
విపక్ష పార్టీలన్నీ ఏకమయితే.. బీజేపీకి ఓటమి ఖాయమని.. వివిద రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలో క్లారిటీ వచ్చింది. కానీ ఆ పొత్తులన్నీ.. ఆయా రాష్ట్ర అవసరాలను బట్టి పార్టీలు పెట్టుకున్నాయి. మరి జాతీయ స్థాయిలో ఆ పార్టీలన్నింటినీ ఎవరు ఏకతాటిపైకి తీసుకు వస్తారు..? ఇది ఇప్పటి వరకూ మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మిలిగింది. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు… తన రాజకీయ కార్యాచరణతోనే సమాధానం ఇస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓ బలమైన కూటమికి రూపకల్పన చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన దేశాన్ని రక్షించుకోవాల్సిన అనివార్యతను.. గట్టిగా నొక్కి చెబుతున్నారు. నిజానికి కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారం తర్వాత విపక్షాల ఐక్యతపై బీజేపీ ఘాటుగా విమర్శలు చేస్తోంది. అందులో మొదటి విమర్శ… విపక్షాల తరపున ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు అన్నదే. ఈ విషయంలో విపక్షాల్లో ఐక్యత లేదు.
కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ వస్తే తానే ప్రధానమంత్రి అవుతానని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రకటించారు. కానీ వెంటనే మమతా బెనర్జీ, శరద్ పవార్ లాంటి వాళ్లు విమర్సలు చేశారు. రాహుల్ కు అంత అనుభవం లేదన్నట్లుగా వారు మాట్లాడారు. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల కూటమి కోసం ప్రయత్నాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు చొరవతో మళ్లీ… ముమ్మరయ్యాయి. అసలు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది టాపిక్ కాకుండా.. తమలో మోదీని ఢీకొట్టగలిగే సమర్థలు చాలా మంది ఉన్నారనే అంశాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆచరణ ప్రారంభించారు. అందర్నీ తానే సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అందర్నీ.. కలిపి ఉంచగలిగే రాజకీయ చాణక్యం చూపిస్తున్నారు. అందుకే జాతీయ మీడియా కూడా.. గత పర్యటనలో చంద్రబాబు పర్యటనకు అసలు కవరేజీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాయుడు ఫ్రంట్ అంటూ.. కొత్త కొత్త విశ్లేషణలు చేసింది. అంటే.. నాయుడు ఫ్రంట్ కళ కొట్టొచ్చినట్లు కనిపించినట్లే..!