ఇంటికంటె గుడి పదిలం అని సామెత. భార్యపోరుతో బాధపడేవారు సరదాగా ఇలా అంటుండడం మనకుతెలుసు. అయితే పగలు ప్రతీకారాలతో ముడిపడిన నేరస్తుల విషయంలో… బయట సమాజంలో ఉండడంకంటె జైలులో ఉండడమే వారికి సర్వవిధాలా శ్రేయస్కరంగా ఉంటుందని కూడా చాలా మంది అంటుంటారు. అలాంటి నేపథ్యంలో.. రకరకాల తీవ్రమైన నేరాలకు సంబంధించి శిక్ష అనుభవిస్తూ జైళ్లలో ఏడేళ్లకు పైగా మగ్గుతూ ఉండి, సత్ప్రవర్తన కారణంగా విడుదల అయిన సుమారు 400 మంది ఖైదీలు.. తమ పాత పగలు, కక్షలు ఇప్పుడు మళ్లీ కాటేస్తాయేమోనని భయపడడంలో ఆశ్చర్యం ఏముంటుంది? అందుకే తాజాగా గణతంత్ర దినోత్సవం నాడు జైలు నుంచి విడుదల అయిన కొందరు ఖైదీలు.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి నుంచి లేదా ఆయన అభిమానులు, అనుచరులనుంచి తమకు ప్రాణభయం ఉంటుందేమోనని ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడుతున్నది.
ఎందుకంటే వైఎస్ జగన్ తాత వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో నిందితులుగా యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న 7 గురు వ్యక్తులు మంగళవారం నాడు జైలునుంచి విడుదల అయ్యారు. రిపబ్లిక్‌డే నాడు సుమారు 400 మంది ఖైదీలను ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేశారు. అందులో భాగంగా ఈ ఏడుగురికి కూడా విముక్తి లభించింది. జగన్ తాత అయిన వైఎస్ రాజారెడ్డి కడప జిల్లాలోను, రాయలసీమ ప్రాంతంలోను అప్పట్లో ప్రముఖ ఫ్యాక్షన్ లీడర్‌గా ముద్ర ఉన్నట్లు ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కొడుకు వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం.. ఈ ఫ్యాక్షన్ కక్షలు, కార్పణ్యాలకు దూరంగా కేవలం రాజకీయాల్లో మాత్రమే వ్యూహప్రతివ్యూహాల్లో కీలకంగా ఉండేవారని స్థానికులు చెబుతుంటారు. ఫ్యాక్షన్ వ్యవహారాలు మొత్తం రాజారెడ్డి మాత్రమే చూసేవారని పుకార్లు ఉండేవి. ఈ నేపథ్యంలో రాజారెడ్డి చాలా దారుణంగా హత్యకు గురయ్యారు.
ఆ నేరానికి సంబంధించి అనంతపురం జైలులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురికి ప్రభుత్వం తాజాగా క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. తాము ఏ నేరం చేయకపోయినప్పటికీ, అన్యాయంగా ఇన్నాళ్లు శిక్ష అనుభవించాం అని, ఏదేమైనప్పటికీ.. ఇప్పుడు విడుదల కావడం చాలా సంతోషంగా ఉన్నదని.. ఈ విడుదలైన రాజారెడ్డి హత్య నిందితులు వెల్లడించడం విశేషం. అయితే రాజారెడ్డి హత్య తో వీరి ప్రమేయంపై, ప్రత్యర్థుల్లో అనుమానాలు ఇప్పటికీ అలాగే ఉంటే మాత్రం.. వారికి ప్రాణగండం ఉండచ్చుననే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో ఉన్న జగన్ ప్రత్యక్షంగా పగ తీర్చుకునే ఉద్దేశంతో లేకపోయినా, రాజారెడ్డి అనుచరుల్లో ఎవరినుంచి అయినా.. వీరికి ప్రాణగండం ఉండవచ్చుననే భయాలు కూడా స్థానికుల్లో పలువురికి కలుగుతున్నాయి. అయితే ఫ్యాక్షన్ పరంగా ఇదివరకటి వాతావరణం ఇప్పుడు లేదని.. సామాజికంగా కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని.. చాలా మంది భయపడుతున్నంత ఉద్రిక్త పరిస్థితులు ఉండకపోవచ్చునని పలువురు అంటున్నారు.