భారతీయ జనతా పార్టీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటకాగుతున్నారని… టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే విమర్శిస్తున్నారు. అందుకే.. కేంద్రం అమలు చేయాల్సిన విభజన హామీల మీద కూడా.. తననే విమర్శిస్తున్నారని… కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని.. ఆయన సూటిగా అడుగుతున్నారు. దానికి పవన్ కల్యాణ్ విచిత్రంగా డిఫెండ్ చేసుకుంటున్నారు. మా అన్ననే ఎదిరించి వచ్చాను.. ఇక మోడీ ఎంత..? అమిత్ షా ఎంత..?., వాళ్లేమీ నా బాబాయ్‌లు కాదు. వాళ్ల మాటలు ఎందుకు వింటారా..? నాకేమీ వేల కోట్ల ఆస్తులు లేవు.. నాకెందుకు భయం..? అంటూ వాదన వినిపిస్తున్నారు. కానీ.. అసలు విషయం మాత్రం మర్చిపోతున్నారు.
మోడీ, షాలను ఎందుకు ప్రశ్నించడం లేదు..?
చాలా మంది గుర్తు లేదనుకుంటారు కానీ… ప్రత్యేకహోదా ఉద్యమంలో.. ప్రంట్ రన్నర్… పవన్ కల్యాణే. ప్రత్యేకహోదా పేరు లేకపోయినా.. ఏదో ఒకటి వస్తే చాల్లే అని చంద్రబాబు అనుకున్న సమయంలో… జగన్ ఆమరణదీక్షల్ని ప్రజలు పట్టించుకోని సమయంలో.. కాకినాడ, తిరుపతి, అనంతపురంలలో సభలు పెట్టింది పవన్ కల్యాణే. ప్రత్యేకహోదా విషయంలో భారతీయ జనతా పార్టీని, మోడీని అత్యంత దారుణంగా విమర్శించింది పవన్ కల్యాణే. ఉత్తరాది అహంకారిగా.. అభివర్ణించింది.. దక్షిణాదిపై వివక్ష చూపిస్తున్నారని గళమెత్తిందీ పవన్ కల్యాణే. మరి హఠాత్తుగా ఎందుకు మార్పు వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడూ.. మోడీ, షాలను ఎందుకు కనీసం ఓ మాట ప్రశ్నించడానికి కూడా వెనుకాడుతున్నారు. ఈ మధ్యలో ఏం జరిగింది..? వేల కోట్ల ఆస్తులు లేవు.. కానీ.. అంతకు మించి రాజకీయ తాయిలం ఇస్తామని హమీ ఇచ్చారా..? లేక.. టీడీపీ నేతలపై జరిపినట్లు.. ఐటీ, ఈడీ దాడులు జరిపి.. ఏమైనా సీక్రెట్లు పట్టుకుపోయారా..?. ఎందుకు ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని నినదించలేకపోతున్నారు..? ఎందుకు రైల్వేజోన్, స్టీల్ ఫ్యాక్టరీ, పోర్టు గురించి ప్రశ్నించలేకపోతున్నారు…?
నాలుగేళ్ల గౌరవాన్ని ప్రధాని నిలుపుకున్నారా..?
పవన్ కల్యాణ్.. ప్రధానమంత్రి మోడీపై.. ఎక్కడ లేని గౌరవం చూపిస్తున్నారు. ఆయనను బూతులు తిడుతున్నారని ఫీలవుతున్నారు. తుని ప్రచార సభలో ధర్మపోరాటం పేరుతో బూతులు తిట్టడం తప్పు అని తేల్చి చెప్పారు. మోడీని గౌరవించి మాట్లాడి సాధించుకోవాలని కూడా సలహా ఇస్తున్నారు. ఎంత గౌరవించాలి.. ఎలా గౌరవించాలో కూడా పవన్ కల్యాణ్ చెబితే బెటర్‌గా ఉంటుందేమో..?. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేస్తారని.. నాలుగేళ్ల పాటు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన గౌరవం కనిపించలేదా..?. గుజరాత్ సీఎంగా… మోడీ ఉన్నప్పుడే… ప్రధానమంత్రుల్ని… నియమించిన చంద్రబాబు.. మోడీ ప్రధాని అయిన తర్వాత తగ్గలేదా..? ఆయనపై పెత్తనం చేయలేదు కదా..?. ప్రధానికి ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చి.. ఏపీ ప్రయోజనాల కోసం ప్రయత్నించారు కదా..? ఆ సమయంలో ఇచ్చిన గౌరవం నిలబెట్టుకోక.. హామీలు అమలు చేయక.. తమిళనాడు తరహ రాజకీయాలకు కుట్ర చేయబట్టే కదా.. చంద్రబాబు ఇప్పుడు బయటకు వచ్చి పోరాటం ప్రారంభించారు. అయినా మోడీని తిడితే.. పవన్ కల్యాణ్‌కు అంత రోషం ఎందుకు వస్తుంది..? ఆయనేమీ బాబాయ్ కాదు కదా..!?. ఏపీని మోసం చేసిన వ్యక్తే కదా..!
మోడీకి ఏ రేంజ్ గౌరవం ఇస్తే ప్రత్యేక హోదా ఇస్తారు..? జనసేనాని క్లారిటీ ఇవ్వొచ్చుగా..?
ధర్మపోరాట దీక్షల్లో మోడీని బూతులు తిడుతున్నారని.. గౌరవం ఇవ్వాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఆ గౌవరం ఏ స్థాయిలో ఉండాలి..?. అదేదో సినిమా సీన్ ఉన్నట్లు… కాళ్ల మీద పడిపోయే గౌరవం..ఇవ్వాలా..?. సగం వంగి విజ్ఞప్తి చేసుకోవాలా..? కాస్త వంగి బతిమాలుకునే గౌరవం ఇస్తే సరిపోతుందా..? లేక జనసేన స్టైల్లో.. తాట తీస్తాం.. తోలు తీస్తాం.. తన్ని తగలేస్తాం.. స్టైల్లో ఇస్తే సరిపోతుందా..?. ఆవేశం పేరుతో గాల్లో పిడి గుద్దులు గుద్ది… గుండెలు బాదుకుని.. ఇష్టం వచ్చినట్లు అరిస్తే అది రాజకీయం కాదు. అలా అని.. రాజకీయాల్లో విమర్శలు చేయకుండా ఉండరు. ప్రతీ దానికి ఓ పద్దతి ఉంటుంది. మోడీని సమర్థించాలనుకుంటే.. టీడీపీ తిట్టింది .. విమర్శించడం… బీజేపీతో ఏ మాత్రం సంబంధం లేని జనసేనానికి ఎందుకు..?
చిరంజీనిని సిగ్గు ఉందా అని ప్రశ్నించావా పవన్ …?
గతంలో బతుకుతూ .. భవిష్యత్ ను పాడు చేసుకునేవాళ్లు ఎప్పటికీ విజ్ఞులు కారు. ఆ విషయం పవన్ కల్యాణ్‌కు బాగా తెలుసు. మొదటి పెళ్లి ఫెయిలందని.. అసలు పెళ్లే చేసుకోకుండా లేరు కదా..! ప్రేమనుపంచే వ్యక్తి దొరికిందని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అలాగే.. ఏదైనా.. కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసింది. దానికి బీజేపీ సహకరించింది. ఆ కాంగ్రెస్ పార్టీలోనే … చిరంజీవి ఎంపీగా ఉన్నారు. విభజన సమయంలో కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. కానీ.. చిరంజీవి ఏం చేశారు..? . .. అన్నయ్యా.. నీకు సిగ్గు ఉందా..అని ప్రశ్నించారా ఎప్పుడైనా..?. ఏ ప్రత్యేకహోదా అయితే.. బీజేపీ ఇవ్వడానికి నిరాకరించిందో… ఏ ప్రత్యేకహోదా వస్తే.. ఏపీ అమెరికా అవుతుదని… నీతో పాటు..అందరూ ప్రచారం చేశారో.. ఆ ప్రత్యేకహోదా ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టానంటున్న కాంగ్రెస్ ఇస్తానంటోంది. మరి… ఆంధ్రాను అమెరికాను చేసే ప్రత్యేకహోదా కోసం.. కాంగ్రెస్‌తో వెళ్లాలా..? నమ్మించి మోసం చేసి.. వంచిస్తున్న.. బీజేపీతోనే వెళ్లాలా…? .. ఎంతైనా జనసేననాని నేర్చుకోవాల్సిన రాజకీయం చాలానే ఉన్నట్లుంది…
——- సుభాష్