తెలంగాణ రాష్ట్ర సమితికి తొమ్మిది నెలల ముందు వచ్చిన ముందస్తు ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గత సార్వత్రిక ఎన్నికలలో పాగా వేసిన టిఆర్ఎస్కు ఈసారి అస్థానం నిలుపుకోవడం కత్తిమీదా సాములా మారింది. కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో భాగమైన ఈ నియోజకవర్గంలో ఇప్పటికి జిల్లా నాయకులు ప్రచారానికి పూర్తి స్థాయిలో దిగలేదు. ఎంపీ కవిత పర్యటనకు వచ్చినప్పుడు మాత్రమే హాజరు వేసుకుని పోవడమే కానీ, టిఆర్ఎస్కు చెందిన పెద్ద నాయకులెవరూ ప్రచారంలో పాల్గొనడం లేదు. ద్వితీయ శ్రేణి నేతలు కూడా… గణేష్ గుప్తాకు దూరంగానే ఉంటున్నారు. నామినేటెడ్ పోస్టులు కూడా అమ్ముకోవడమే దీనికి కారణం.
టిఆర్ఎస్ యూత్ నాయకులు కూడా ఇప్పటీ వరకూ ప్రచారంలో అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. ఇక తెలంగాణ జాగృతి నాయకులు అయితే అర్బన్‌లో ప్రచారం అంటే తమకు సంబంధం లేదన్నట్లుగా పట్టించుకోవడం లేదు.
సీనియర్ నేత డీఎస్.. టీఆర్ఎస్లో చేరినప్పుడు.. తనతో పాటు పలువురు కార్పొరేటర్లు, పలువురు నాయకులను అధికారపార్టీలోకి చేర్పించారు. ప్రస్తుతం ఆయన టిఆర్ఎస్ కు దూరమయ్యారు. కాంగ్రెస్ నాయకులతో టచ్‌లో ఉన్నారు. సాంకేతిక కారణాలతో ఆ పార్టీలో చేరలేదు కానీ.. అనఫీషియల్‌గా కాంగ్రెస్ మెంబరైపోయారు. ఇప్పుడు డి.ఎస్ అనుచరులు అధికారా పార్టీకి ప్రచారం చేయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. గతంలో తమకు రాజకీయంగా సహకరించిన డిఎస్ మాట వినాలా లేక మాజీ ఎమ్మెల్యే మాటా వినాలా అనేది తేల్చుకోలేక కొందరు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి డి.ఎస్ రాజీనామా చేయ్యక పోవడం, టిఆర్ఎస్ పార్టీ కుడా డిఎస్‌ను సస్పెండ్ చేయ్యక పోవడంతో అయన అనుచర గణం పరిస్థితి ముందు నుయ్యు, వేనుక గోయ్యిలా తయారైంది.
టీఆర్ఎస్ అధికార వచ్చాక కమీషన్లు, కాంట్రాక్ట్‌లు, పర్సంటేజ్‌ల ద్వారా లాభపడిన కొందరు మాత్రమే ప్రచారం చురుకుగా పాల్గొంటున్నారని పట్టణ ప్రజలు అనుకుంటున్నారు. పరిస్థితుల్లో మార్పు రాకపోతే విభిన్న అభిప్రాయ భేదాలతో కొనసాగుతున్న టిఆర్ఎస్ నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఈసారి గట్టెక్కడం కష్టమన్నది రాజకీయ పరిశీలకుల వాదన. సెంటిమెంట్ కూడా.. గత ఎన్నికల్లో ఉన్నంత లేదు. అభివృద్ధి పనులు నత్త నడకన సాగి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. నియోజకవర్గంలో పరిస్తితి మారుస్తామని… టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.