దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎదుర్కోవడానికి విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఇంకో కారణం లేదు. నరేంద్రమోడీని ఎదుర్కోవడానికి తప్పు లేదు. కానీ ఎందుకు ఎదుర్కోవాలి…? సేవ్ డెమెక్రసి.. సేవ్ నేషన్ అంటున్నారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నారని.. దేశాన్ని సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నారని.. అందుకే.. సేవ్ డెమెక్రసి.. సేవ్ నేషన్ పేరుతో మోడీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్నామని చెబుతున్నారు.
విపక్ష పార్టీల మధ్య విధానపరమైన సారుప్యత ఉందా..?
నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న పార్టీల మధ్య సారుప్యత ఉందా..? అన్నది ఇక్కడ ముఖ్యమైన అంశం. ముఖ్యమంత్రి చంద్రబాబు… నోట్ల రద్దును స్వాగతించారు. తానే సలహా ఇచ్చానన్నారు. జీఎస్టీని సమర్థించారు. ప్రత్యేకహోదా ఇష్యూ వచ్చే సరికి.. నాలుగేళ్ల కాలంలో… ఏ వివాదాస్పద నిర్ణయాన్నైనా… వ్యతిరేకించారా..? పెద్ద నోట్ల రద్దుపైన.. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసిన ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకించింది. తీవ్ర విమర్శలు చేసింది. కానీ చంద్రబాబునాయుడు సమర్థించారు. అలాగే.. జీఎస్టీ పై.. కూడా అందరూ విమర్శలు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం అదో గొప్ప సంస్కరణ అన్నారు. అలాగే క్యాష్ లెస్ ఎకాననీ పేరిట జరుగుతున్న ప్రచారమూ.. తతంగమూ.. అంతే. దానికి చంద్రబాబే… కన్వీనర్‌గా ఉన్నారు. సమస్య ఎక్కడ ఉంటుందంటే.. కామన్ ఎజెండాలో ఉండాలి. నిన్న చంద్రబాబు కూడా కామన్ ఎజెండా ఉంటుందని చెప్పారు. ఉదాహరణకు కామన్ ఎజెండాలో నోట్ల రద్దును వ్యతిరేకించాలని ఉందనుకోండి.. చంద్రబాబు ఏం చెబుతారు..? . .. అందువల్ల… ఈ కూటమిలో ఉన్న ప్రధానమైన బలహీనత… విధానపరమైన సారూప్యత లేకపోవడం.
రాజకీయ అవసరాలే కలుపుతున్నాయా..?
మోడీని ఓడించాలని గనుక.. విడివిడిగా పోతే… ఓడించలేం కనుక.. అందరూ కలిసి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇది.. ఓ రాజకీయ అత్యవసం లాంటిది. ఇది పొలిటికల్ కంపల్సన్ మొదటిది… డెమెక్రటిక్ కంపల్సన్ అనేది రెండోది. మోడీ వ్యతిరేక విధానాల పల్లవి ఎప్పటి నుంచో ఉన్నది.. ఇప్పుడు దానిలో చంద్రబాబు శృతికలిపారు. ఇక రెండోది ఏమిటంటే.. ఈ రాజకీయ పార్టీలన్నీ.. ఏవీ కూడా.. బీజేపీ పట్ల… తీవ్రమైన వ్యతిరేకత చూపించిన చరిత్ర లేదు. టీడీపీ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత చారిత్రక తప్పిదమన్నారు. మోడీని సీఎం పదవి నుంచి తప్పించకపోతే.. అప్పట్లో కేంద్రం నుంచి వైదొలుగుతామన్నారు. ఆ తర్వాత ఒక్క స్పీకర్ పదవినే తీసుకున్నారు. అలాగే నరేంద్రమోడీ నాయకత్వంలో పని చేశారు. ఇప్పుడు మళ్లీ మోడీకి వ్యతిరేకమయ్యారు. అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా.. తీవ్రమైన వ్యతిరేకత తీసుకున్న పార్టీలు.. ఏవీ లేవు. డీఎంకే వాజ్‌పేయి ప్రభుత్వంలో భాగస్వామి. మమతా బెనర్జీ రైల్వే మంత్రి . మాయావతి… యూపీలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎస్పీ.. రోజుకో పార్టీతో కలుస్తోంది. ఫరూక్ అబ్దుల్లా.. దేశంలో అన్ని కూటముల్లో ఉన్నారు. శరద్ పవార్.. ఓ అడుగు కాంగ్రెస్ వైపు..మరో వైపు బీజేపీ వైపు ఉంటారు. ఇలాంటి.. నేతలతో కలిసి.. .ప్రజల విశ్వాసాన్ని పొందేలా .. బీజేపీ వ్యతిరేక కూటమి ఎలా ఏర్పాటు చేస్తారు..?
ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకోగలరా..?
నాయకుల మధ్య పంచాయతీ… ఓ పెద్ద సమస్య అవుతుంది. ఈ కూటమిలోని సీనియర్ నేతలందరికీ… ప్రధానమంత్రి పదవిపై ఆశ ఉంది. దేశాన్ని రక్షించడం తర్వాత సంగతి.. ముందు వాళ్ల పంచాయతీ వాళ్లు తేల్చుకోవాలి. తమకు పూర్తి మెజార్టీ వస్తే.. తానే ప్రధాని అవుతానని రాహుల్ ప్రకటించారు. ఆ తర్వాత వెంటే.. శరద్ పవార్, మమతా బెనర్జీ, మాయావతి లాంటి వాళ్లు.. ఖండించారు. ఎందుకంటే.. వీళ్లందిరకీ ప్రధాని కావాలని ఉంది. చివరికి చంద్రబాబునాయుడుకు కూడా.. లోకేష్‌కు ఏపీ పీఠం అప్పగించి.. తాను కేంద్రానికి వెళ్లాలని ఉంది. ఇంత మంది ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు..? బీజేపీలో ఒక్కడే మోడీ ఉన్నాడు… కానీ కూటమిలో చాలా మంది ఉన్నారు. 1977లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా… అనేక సిద్ధాంతాలున్న పార్టీలు కలిశాయి. మూడేళ్లు మాత్రమే జనతా పార్టీ ప్రభుత్వం మనగలిగింది. ఆ తర్వాత ఇందిగాంధీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. సరిగ్గా వీపీ సింగ్..నేషనల్ ఫ్రంట్ ప్రయోగం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. యునైటెడ్ ఫ్రంట్ విపలం తర్వాత.. బీజేపీ అధికారంలోకి వచ్చింది. యూపీఏ తర్వాత బీజేపీ.. మరింత బలంగా విజయం సాధించింది.
తమ విధానాలేమిటో ప్రజల ముందు ఉంచగలరా..?
ఎవర్ని ఓడించడానికి ఈ పార్టీలన్నీ కలుస్తున్నాయని…. చెబుతున్నాయో.. ఆ కలయికలో నిజాయితీ లేకపోవడం వల్ల.. విధానపరమైన ప్రత్యామ్నాయం చూపకపోవడం వల్ల.. ఈ ప్రయోగాలు విపలమవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో.. బీజేపీ మరింత బలపడింది. అందుకే.. ఈ కూటమి ఇప్పటికైనా.. పొలిటికల్ కంపల్సన్ కోసం.. కాకుండా… డెమెక్రటిక్ కంపల్సన్ కోసం.. కలిస్తే ప్రయోజనం ఉంటుంది. బీజేపీని సీబీఐ బలహీన పరుస్తోంది.. ఆర్బీఐని బలహీన పరుస్తోంది. న్యాయవ్యవస్థలో కేంద్రం జోక్యం చేసుకుంటోంది. ఇవన్నీ నిజాలు.. వీటిని ఎలా బలపరుస్తారో.. బీజేపీ కన్నా.. ఎలా భిన్నంగా.. దేశం కోసం కృషి చేస్తారో చెప్పాల్సి ఉంది. రూపాయి పతనం, పెట్రోల్ చార్జీలు తగ్గింపు… ఎలా కంట్రోల్ చేస్తారో చెప్పాలి. మేం చేస్తామని చెబితే ప్రజలు నమ్మరు. ఓ విధానపరమైన… ప్రత్యామ్నాయం చూపితేనే ప్రజలు నమ్ముతారు.