వైఎస్ జగన్ పాదాయాత్ర కొనసాగింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్రను మరోసారి వాయిదా వేశారు. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఇంకా విశ్రాంతి అవసరమని చెప్పారని.. ఆ మేరకు పాదయాత్ర వాయిదా వేసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి జగన్ గాయం విషయంలోనో చాలా పెద్ద సెటైర్లు పడ్డాయి. అలాంటి… పది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నా.. ఇంకా.. గాయం తగ్గలేదన్న కారణం చూపి.. పాదయాత్రకు డుమ్మకొట్టడం ఏమిటో.. సొంత పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు.
పదే పదే వాయిదా వేస్తూండటంతో పాదయాత్ర డొలాయమానంలో పడింది. స్వల్ప గాయమే కావడంతో . మరో రెండు రోజుల్లో… పాదయాత్ర ప్రారంభమవుతుదని దాడి జరిగినప్పుడు వైసీపీ నేతలు ప్రకటించారు. ఆ తర్వాత వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రారంభిస్తారని వైసీపీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు డాక్టర్లు ఇంకా విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో పాదయాత్ర మరింత ఆలస్యమవుతోంది. భుజం కదిలించవదద్దని డాక్టర్లు చెప్పారని.. ఇలాంటి పరిస్థితుల్లో పాదయాత్ర వద్దని జగన్ కుటుంబసభ్యులు సలహాలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎయిర్పోర్టులో ఘటన జరిగిన తర్వాత వైద్యం చేసిన డాక్టర్…బ్యాండేజ్ వేసి పంపించారు. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ తో తగ్గిపోతుందన్నారు. సాధారణంగా అరసెంటిమీటర్ గాయం అయితే.. చేసే వైద్యమే అది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత నింపాదిగా… విమానంలో హైదరాబాద్ వచ్చి.. అస్పత్రిలో చేరిపోవడమే అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆ తర్వాత సెంటిమీటరున్నర గాయం అయిందని.. నరం తెగిందని.. తొమ్మిది కుట్లేశామంటూ.. వైద్యులు ప్రకటించండంపై టీడీపీ నేతలు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతోనే.. దాడి వ్యవహారం పక్కకుపోయింది. రాజకీయం ముందుకొచ్చింది.
మరో వైపు.. వైసీపీ నేతలు..ఢిల్లీలో జాతీయ పార్టీల నేతలను కలిశారు. వైఎస్ జగన్ పై జరిగిన దాడి గురించి.. ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన విధానంగా గురించి వివరించారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం.. వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన వెంటనే రాష్ట్రపతిని కూడా కలిసి.. ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. జగన్ తో సహా హైకోర్టులో మొత్తం మూడు పిటిషన్లు వేశారు. స్వతంత్ర సంస్థ దర్యాప్తును కోరుతున్నారు. వాటిపై విచారణ జరగనుంది.
కులాసాగా నడిచి వెళ్లిన జగన్ కావాలనే సాగదీస్తున్నారనే విమర్శలు సహజంగానే వస్తున్నాయి. రాజకీయ మైలేజ్ తీసుకోవడం ఎలా అనే వ్యూహరచనలో వైసీపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. హత్యాయత్నంగా ఎంత ఫోకస్ చేసినా మైలేజీ రాలేదన్న అసంతృప్తి జగన్ లో ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.