ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసిన దగ్గర్నుంచీ సాక్షి పత్రికకు మరోసారి పూనకం వచ్చిన సంగతి తెలిసిందే! ప్రతిరోజూ ఆ మీటింగ్ గురించే రాస్తున్నారు. ఈరోజు ‘దేశ రక్షణ కోసం కాదు.. దేశం రక్షణ కోసమే’ అంటూ ఓ కథనం రాశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లొచ్చాక అక్కడి మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోందన్నది దీని సారాంశం. చంద్రబాబు ఢిల్లీ టూరు వెనక అసలు కారణం వేరే ఉందనీ, తన సొంత పార్టీ అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసమే ఆయన వచ్చారని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారనీ, దానిపై దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరుగుతుందేమోనని భయపడుతున్నారనీ, తనపై అలాంటి విచారణలు ఏవీ జరగకుండా ఉండాలన్న వ్యూహంతోనే ఆయన భాజపా వ్యతిరేక కూటమిలో చేరారంటూ ఒక సుదీర్ఘ విశ్లేషణ చేశారు. ఇంకోటి.. చంద్రబాబు ఢిల్లీలో ఎప్పుడూ చక్రం తిప్పింది లేదంటూ ఓ చోట అభిప్రాయపడ్డారు. జాతీయ మీడియా సంస్థలు చేస్తున్న సర్వేల్లో వైకాపా అధికారంలోకి వస్తుందని స్పష్టమౌతోంది కాబట్టి, అందుకే చంద్రబాబు నాయుడు చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ తో చేతులు కలిపారని రాశారు.
నిజానికి, దేశ రాజకీయాల్లో పార్టీల మధ్య మారుతున్న సమీకరణాలను కేవలం ‘కేసులు దర్యాప్తులు’ అనే కోణం నుంచి తప్ప, వేరే విధంగా చూడలేని హ్రస్వ దృష్టి సాక్షిది! వారికి ఎక్కడ ఏం జరిగినా.. ఎవరో ఏదో కేసు మాఫీ కోసం ప్రయత్నిస్తున్నట్టే అనిపిస్తుంది. తప్పదు.. ఎందుకంటే, యథా రాజా.. తథా వారి పత్రిక! దేశవ్యాప్తంగా సీబీఐ, ఆర్బీఐ వంటి వ్యవస్థలను మోడీ సర్కారు ఎలా నియంత్రించే ప్రయత్నం చేస్తోందో దానిపై చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్యంలోని వ్యవస్థల స్వయం ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారుతోందన్న ఆవేదన వ్యక్తమౌతోంది. అవి సాక్షికి అసవరం లేని విషయాలైపోయాయి. ఎందుకంటే అవన్నీ భాజపా వ్యతిరేక అంశాలు కాబ్టట్టేనా..? ఇక, ఈ కథనం విషయానికొస్తే… అసలు విషయాన్ని సాక్షి వదిలేసింది! అదేంటంటే… తనపై దర్యాప్తు జరుగుతుందేమోననే భయంతోనే చంద్రబాబు కాంగ్రెస్ చెంతకు చేరారు అంటున్నారు కాదా! ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేదే..? టీడీపీ అవినీతిపై దర్యాప్తులు చేయించాలంటే భాజపా చెయ్యొచ్చు. అలాంటి నిర్ణయాలు మోడీ సర్కారు తీసుకుంటే… ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎలా ఆపగలదు..? రాష్ట్రంలో అంతా అవినీతిమయం అని విమర్శిస్తున్న భాజపా నేతలు కూడా… కేంద్రం నుంచి విచారణ చేయించేకోవచ్చు అనే కోణాన్ని ఎందుకు వదిలేస్తున్నారు?
ఇంకో విషయం… రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వస్తుందని జాతీయ సర్వేలు చెబుతున్నాయీ, కాబట్టి చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ తోడు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు అన్నారు. ఇది మరింత అర్థరహితమైన వ్యాఖ్య. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఎక్కడుందిప్పుడు..? వచ్చే ఎన్నికల్లో ఓ పది సీట్లు వచ్చినా తమకు మహా ప్రసాదమే అన్నట్టుగా ఆ పార్టీ ఉంది. ఒకవేళ అనూహ్యంగా ఆంధ్రాలో తమ ప్రభావం ఉంటుంది అనుకుంటే… టీడీపీతో స్నేహానికి ఎందుకు సిద్ధమౌతుంది..?