స్టార్ దర్శకుడి స్టేటస్నీ, కోట్ల రూపాయల పారితోషికాన్నీ అందుకున్న దర్శకుడు శ్రీనువైట్ల. ఎంతటి దర్శకుడి కెరీర్నైనా రెండు మూడు ఫ్లాపులు అల్లకల్లోలం చేస్తాయి. దానికి శ్రీనువైట్లనే నిదర్శనం. ఆగడు ఫ్లాప్ తనని బాగా ఇబ్బంది పెట్టింది. ఆ తరవాత అతని బండి అపసవ్య దిశలో నడిచింది. ఎట్టకేలకు మైత్రీ మూవీస్‌ని పట్టి – ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ని సెట్ చేసుకోగలిగాడు. అదే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. రవితేజ – శ్రీనువైట్ల కాంబినేషన్ అంటేనే.. ప్రత్యేకమైన ఆసక్తి. అది ‘అమర్ అక్బర్ ఆంటోనీ’కి ప్లప్ అయ్యింది.
అయితే.. ఈ సినిమాతోనైనా శ్రీను తన పంథా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దాన్ని శ్రీనువైట్ల కూడా గుర్తించాడు. అందుకే కథ, కథనాల విషయంలో శ్రీనువైట్ల చాలా జాగ్రత్త తీసుకున్నాడని తెలుస్తోంది. శ్రీనువైట్ల – రవితేజ సినిమా అనగానే ‘ఓహో.. ఇలా ఉంటుందేమో’ అని ఫిక్సయిపోయి జనాలు థియేటర్ కి వస్తారు. అయితే ఆ అంచనాల్ని తలకిందులు చేసే కొత్త తరహా కథతో శ్రీనువైట్ల ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా శ్రీను సినిమాల్లో కథాబలం పెద్దగా ఉండదు. కేవలం సన్నివేశాలతో… వినోదాన్ని పంచిస్తాడు. వెరైటీ పాత్రలు మన ముందుకొచ్చి నవ్విస్తాయి. విలన్లను బకరాలుగా చేసి ఆడుకోవడం శ్రీనువైట్ల స్టైల్. అయితే అవేం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో కనిపించకుండా జాగ్రత్త పడ్డాడట. తొలిసారి ఓ థ్రిల్లర్ తరహా కథని ఎంచుకున్నాడట శ్రీనువైట్ల. తన పాత సినిమా ఛాయలేం కనిపించకుండా జాగ్రత్త పడుతూ… తన నుంచి ఆశించే ఎంటర్టైనర్ని మాత్రం అందించాడని తెలుస్తోంది.
ఈమధ్య వచ్చిన టీజర్ మొత్తం సీరియెస్ నోట్‌తోనే సాగింది. అది కూడా శ్రీనువైట్ల కావాలని చేసిన పనే. చివరికి సునీల్ పాత్రని కూడా దాచేశాడు. అలాంటి అంశాలన్నీ ట్రైలర్లో రివీల్ చేయబోతున్నాడట. మొత్తానికి ఈసారి కామెడీ కంటే.. కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, స్క్రీన్ ప్లేలో ఎక్కువ టిస్ట్‌లు పెట్టుకుని, ఓ థ్రిల్లర్ సినిమాని చూపించబోతున్నాడు. శ్రీను నుంచి ఈ తరహా కథ రావడం నిజంగా షాకే. ఆ షాకింగ్ వాల్యూనే ఈ సినిమాని హిట్ చేస్తుందన్నది శ్రీనువైట్ల ధీమా. అదే జరిగితే ఈ దర్శకుడి కెరీర్ మళ్లీ గాడిన పడినట్టే.