రోబో 2.ఓ… నాలుగేళ్లుగా సెట్స్‌పై ఉన్న సినిమా ఇది. ఎప్పుడెప్పుడు చూద్దామా అని రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు మూహూర్తం ఖరారైపోయింది. ఇంతలో ట్రైలర్ కూడా వచ్చేసింది. శంకర్ సినిమా అనగానే సగటు సినీ ప్రేక్షకుడు ఓ విజువల్ వండర్ ఆశిస్తాడు. దానికి ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్‌ని రూపొందించాడు శంకర్. సెల్ఫోన్లపై ఓ పక్షిరాజు చేసే యుద్ధం – దాంతో తలపడే చిట్టి – ఇదీ స్థూలంగా ఈ సినిమా కథ. దాన్నిఈ ట్రైలర్లో చూపించారు. రోబో లో కేవలం చిట్టి మాత్రమే విన్యాసాలు చేస్తుంది. ఇందులో పక్షిరాజు (అక్షయ్ కుమార్) కూడా తోడయ్యాడు. వాళ్లిద్దరి మధ్య రసవత్తర పోరు జరగడం ఖాయంలా అనిపిస్తుంది. కొన్ని విజువల్ ఎఫెక్ట్ షాట్లు చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇంకొన్ని మరీ వీడియోగేమ్ని తలపిస్తున్నాయి. అక్షయ్ కుమార్‌కి చెప్పిన డబ్బింగ్ కూడా ఏదోలా ఉంది. బహుశా.. దాన్ని సరిచేద్దామనుకుంటున్నారేమో చూడాలి. శంకర్సినిమాల్లో హీరో – హీరోయిన్ల మధ్య రొమాన్స్కీ చోటుంటుంది. దాన్ని చాలా అందంగా, విజువల్ వండర్లా తీర్చిదిద్దుతారు. ఈ కథలో ఆ అవకాశాలున్నా.. అందుకు సంబంధించిన షాట్లు చాలా తక్కువ పడ్డాయి. రెహమాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తెరపై కనిపిస్తున్న విజువల్స్, అక్షయ్ కుమార్ నటన, రజనీ స్టైల్… ఇవన్నీ ఈ సినిమా స్థాయిని చూపిస్తున్నాయి. తెరపై ఇంతకు పదిరెట్ల వినోదం ఉండబోతోందన్నది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అదే జరిగితే.. రోబో రికార్డులు 2.ఓ తిరగరాస్తుందనడంలో సందేహం లేదు.