ఈమధ్య కాలంలో కాస్త నలుగురి నోటిలో నానుతున్న సినిమా `భైరవగీత`. టీజర్ చూశాక…. ఈ సినిమాపై కొన్ని ఆశలు, అంచనాలూ ఏర్పడ్డాయి. రాంగోపాల్ వర్మ శిష్యుడు సిద్దార్థ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం, స్వయంగా రాంగోపాల్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించడం… టీజర్లో కొన్ని హాటు, ఇంకొన్ని నాటు అంశాలు కనిపించడంతో… ఫోకస్ తెచ్చుకోగలిగింది. ఇప్పుడు ట్రైలర్ విడుదలైంది. రాంగోపాల్ వర్మ రక్త చరిత్రకు ఓ ప్రేమకథ జోడించినట్టు అనిపిస్తోంది. నటీనటులు అంతా కొత్తవారే. కానీ ఇంటెన్సిటీ మాత్రం పుష్కలంగా కనిపిస్తోంది. రాయలసీమలో ఉన్న బానిసత్వంపై కథానాయకుడు చేసిన పోరాటంలా అనిపిస్తోంది. యాక్షన్ డోసు ఎక్కువగా ఉంది. నరుక్కోవడాలు, రక్తపాతం.. పుష్కలంగా ఉంది. ట్రైలర్ చివర్లో రాంగోపాల్ వర్మ టేకింగ్ కనిపించింది. వర్మ శిష్యుడు కదా, ఆ ముద్ర నుంచి బయటకు రాలేకపోయాడు. కథానాయిక ఇర్రా మోర్ అందంగా కనిపిస్తోంది. దానికి తోడు `ఆర్ ఎక్స్ 100` సినిమాలో ఘాటు ముద్దులు కొన్ని ఉన్నాయి. బెడ్ రూమ్ సీన్లు కూడా ఒకటీ అరా కనిపిస్తున్నాయి. రాయలసీమలోని ఫ్యాక్షనిజాన్ని మరీ `రా`గా చూపించారేమో అనిపిస్తోంది. మొత్తానికి… టీజర్ లానే ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. `ఆర్ ఎక్స్ 100`లా నిలబడుతుందో, లేదంటే.. ఈమధ్య వచ్చిన చిన్న సినిమాల్లానే ఇదీ వచ్చి, వెళ్లిపోతుందో చూడాలి.