‘రోబో 2.ఓ’ బడ్జెట్ ఎంత?
– యేడాది క్రితం వరకూ ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లే. చిత్రబృందం కూడా ఇదే మాట చెబుతూ వచ్చింది.
ఆ తరవాత రూ.300 కోట్లన్నారు..
రూ.400 కోట్లన్నారు..
ఇప్పుడు ఏకంగా రూ.600 కోట్లు అంటున్నారు.
స్వయంగా రజనీకాంతే… ‘ఆరొందల కోట్లతో సినిమాపూర్తి చేశాం’ అని సభాముఖంగా ప్రకటించేశాడు కూడా. అంటే.. అనుకున్న బడ్జెట్‌కి మూడొంతులు ఖర్చయ్యింన్నమాట. శంకర్ సినిమా కదా, భారీగా ఖర్చు పెట్టడం సహజమే. అయితే మరీ ఆరొందల కోట్లంటే నమ్మశక్యం కావడం లేదు. ట్రైలర్ చూసినా అదే అనుమానం. సినిమాలో దాదాపు 80 శాతం బ్లూ మేట్లో తీసుంటారు. దానికి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ అవసరం అయ్యుంటాయి. రజనీకాంత్, అక్షయ్ కుమార్‌లు మినహాయిస్తే.. స్టార్లెవరూ ఈ సినిమాలో లేరు. పారితోషికాల లెక్క రూ.150 కోట్లు అనుకుందాం. అంటే రూ.450 కోట్లు మేకింగ్‌కి అయ్యిందా? ఇది కేవలం గాలి లెక్కలేనా?? నిజంగానే ఇంత ఖర్చు పెట్టారా?
నిజంగా ఈ సినిమాకి రూ.600 కోట్లయ్యాయంటే అది అద్భుతమే అనుకోవాలి. భారతీయ చలన చిత్ర చరిత్రలో రికార్డుగా అభివర్ణించాలి. విజువల్ ఎఫెక్ట్స్‌కీ, సెట్స్‌కీ, భారీ తారాగణానికి పెద్ద పీట వేసిన `బాహుబలి` రెండు చిత్రాలకు కలిపే రూ.600 కోట్ల బడ్జెట్ అవ్వలేదు. అలాంటిది రోబో 2.ఓకి అంత ఖర్చు పెట్టాల్సిన అసవరం ఏముంది? సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ తో తీసినా ఆ స్థాయి ఖర్చు అవ్వదు. కేవలం డిలే వల్ల ఈ స్థాయిలో ఖర్చు పెరిగిందా? లేదంటేనే నిజంగానే తెరపై శంకర్ ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాడా?? అన్నీ కాదంటే – కేవలం హైప్ కోసమే ఈ స్థాయిలో అంకెలు చెప్పేస్తున్నారా? అనేది కొత్త చర్చకు దారి తీసింది. రోబో సంగతికి వద్దాం. దాదాపు రూ.150 కోట్లతో ఈ సినిమా పూర్తయ్యింది. సినిమా మొత్తం గ్రాఫిక్సేం ఉండవు. మూమూలు కమర్షియల్ పంథాలో సాగుతూనే అక్కడక్కడ విజువల్ ఎఫెక్ట్స్ చూపిస్తూ వెళ్లాడు శంకర్. సినిమా మొత్తమ్మీద దాదాపు 45 నిమిషాలు గ్రాఫిక్స్ అవసరమయ్యాయేమో. `రోబో 2.ఓ`కీ శంకర్ అదే పంథాలో వెళ్లి ఉంటాడు. అందులో అనుమానాలేం అవసరం లేదు. పైగా ఈమధ్య విజువల్ ఎఫెక్ట్స్ కూడా చవకైపోతోంది. అంతర్జాతీయ సంస్థలు రంగంలోకి దిగి తక్కువ ఖర్చుతో కావల్సిన నాణ్యతతో గ్రాఫిక్స్ డిజైన్ చేస్తున్నారు. అలా చూసినా. ఆరొందల కోట్లు కేవలం నోటి మాటగానే వినిపిస్తోంది. శంకర్ ఆరొందల కోట్ల సినిమా తీశాడంటే.. దక్షిణాదివాళ్లుగా మనం గర్వపడాల్సిందే. కానీ… అది నోటిమాట కాకపోతే బాగుంటుందన్నది అందరి ఆశ. మరి శంకర్ ఏం చేస్తాడో చూడాలి.