ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ చేతులు కలపడం గురించే చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలెవరూ.. ఈ విషయంలో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోలేదు. నేతలు కూడా.. తమ పని తాము కులాసాగా చేసుకుంటున్నారు. సభ్యత్వ నమోదు వ్యవహారాల్లో క్యాడర్ మునిగిపోయి ఉంది. కానీ.. ఇతర పార్టీలకు చెందిన వాళ్లు మాత్రం.. తెలుగుదేశం పార్టీ వ్యవహారంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. అదే పనిగా.. మాట్లాడుతున్నారు. టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడం గురించి ఎన్టీఆర్ ఆత్మక్షోభ దగ్గర్నుంచి.. రాజకీయ విలువల వరకూ.. అనేకకోణాల్లో విశ్లేషిస్తున్నారు. వీటన్నింటినీ టీడీపీ నేతలు వినోదంగా చూస్తున్నారు కానీ.. పెద్దగా కల్పించుకోవడానికి కూడా సిద్ధంగా లేరు.
టీడీపీ నేతల తీరు చూస్తూంటే.. తామే ఏదో ప్లాన్ చేసి.. మరీ ఈ సిట్యుటేషన్ తెచ్చుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మారిపోయిన రాజకీయ పరిస్థితి… ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, జనసేన తీరు చూస్తూంటే…టీడీపీ నేతలకు ఇంకా ఆనందం ఉంది. ఎందుకంటే.. ఇప్పుడు వాళ్లు… రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ గురించి మాత్రమే చర్చిస్తున్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. మిగతావన్నీ పక్కన పెట్టేశారు. దీన్ని కాసేపు పక్కన పెట్టి.. అసలు రాజకీయాన్ని చూస్తే… పాపం వైసీపీ అనిపించక మానదు. ఎందుకంటే.. తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై. ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిందని గగ్గోలు పెట్టి… చేయాల్సింది పొలిటికల్ డ్రామా చేసినా.. కనీస మైలేజీ రాకపోగా.. అనూహ్యంగా చంద్రబాబు ట్రాప్‌లో పడిపోయారు. కోడి కత్తి ఇష్యూని జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని మధ్యలో నిలిపి వేసి…కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపిందని… అది ఎన్టీఆర్ ఆత్మకు క్షోభకు గురి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేయడంలో మునిగిపోయారు.
వైసీపీలో ఏ -1 జగనే కాదు.. , ఏ -2 విజయసాయిరెడ్డి… జగన్ మీడియా సహా… ఆయన సోషల్ మీడియా టీం మొత్తం కోడి కత్తిని మర్చిపోయింది. టీడీపీ రాజకీయ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఫలితంగా.. ఇప్పుడు… కోడికత్తి దాడి ఘటన పక్కపోయింది. పట్టించుకునేవారే లేరు. జగన్ మీడియామొత్తం.. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో టీడీపీపై దుమ్మెత్తి పోయడానికే ప్రయత్నించింది. విలువల గురించి లెక్చర్లిచ్చింది. సి. రామచంద్రయ్య అనే లీడర్ దగ్గర్నుంచి చాలా మందితో మైక్ ముందు పెట్టించి విమర్శింప చేసింది. వైసీపీ నేతలు.. అంతకంటే ఎక్కువగా విమర్శించారు. కానీ దీని వల్ల ఏమి వచ్చింది..? టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందా..? టీడీపీ క్యాడర్‌లో అసంతృప్తి వస్తుందా..? లేక ఇంకేమైనా రాజకీయ సంక్షోభం టీడీపీలో వస్తుందా..?. ఇలా వస్తుందని ఆశిస్తే.. అంతకు మించి రాజకీయ అజ్ఞాని ఎవరూ ఉండరు. ఎందుకంటే… పార్టీ అధినేత నిర్ణయాన్ని ఏ క్యాడర్ కూడా ధిక్కరించదు.
కాంగ్రెస్‌తో చేతులు కలిపితే.. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని… టీడీపీ క్యాడర్‌ని రెచ్చగొట్టగలమనుకోవడం కూడా… అంత కంటే ఎక్కువ అమాయకత్వమే. పార్టీ బాగు కోసం.. సాక్షాత్తూ ఎన్టీఆర్‌నే పక్కన పెట్టినప్పుడు.. క్యాడర్… చంద్రబాబుకు అండగా నిలిచింది. ఇప్పుడు అదే పార్టీపైకి దండులా వస్తున్న మోడీని అడ్డుకోవడానికి చంద్రబాబు అంత కంటే ధాటిగా పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో.. రేసులో లేని కాంగ్రెస్ ను బూచి చూపి.. టీడీపీ క్యాడర్‌ను రెచ్చగొట్టడం సాధ్యమయ్యేదేనా..? సాధ్యం కాదు కాబట్టే.. చంద్రబాబు టైం చూసి స్కెచ్చేశారు. వైసీపీ వాళ్లు ట్రాప్‌లో పడిపోయారు.