మహాకూటమి సీట్ల ప్రకటనకు సమయం దగ్గర పడటంతో.. ఆ కూటమిని చిన్నాభిన్నాం చేయడానికి టీఆర్ఎస్ అధినేత ప్లాన్ రెడీ చేసుకున్నారు. టిక్కెట్లు రాని నియోజకవర్గ స్థాయి నేతలందరికీ ఓ విలువ కట్టి కారెక్కించడానికి రెడీ అయిపోయారు. కాంగ్రెస్ నుంచి సీట్లను ఆశిస్తున్న అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గంలో నలుగురు, ఐదుగురు వరకు ఉన్నారు. ఇక టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు ఇచ్చిన తర్వాత… నిరాశ పడే సీటు ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారందర్నీ ఇప్పటికే లిస్టవుట్ చేసి.. కారెక్కించడానికి సన్నాహాలు చేశారు. మహకూటమిని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నేతల అసంతృప్తిని వాడుకోవాలని.. కేసీఆర్ నిర్ణయించారు. సీటు దక్కని కాంగ్రెస్ నేతలను పార్టీలోకి రప్పించేందుకు ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి అమలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తయిందట. అందుకే… కూటమిలో అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్‌కు సినిమా చూపిస్తామంటూ… టీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రకటనలు చేస్తున్నారు.
అయితే.. కారెక్కించడం మాత్రమే ప్లాన్‌లో భాగంగా కాదు. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో.. బలమైన కాంగ్రెస్ అభ్యర్థుల్ని.. రెబెల్స్‌గా నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సీపీఐకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ తరపున అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు ప్రచారం చేసుకుంటున్నారు., శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ప్రచారం ప్రారంభించారు. ఇవన్నీ పొత్తుల్లో పోయే సీట్లే. ఇలా ప్రచారం చేసుకుంటున్న వారంతా.. ఇండిపెండెంట్లుగా పోటీకి దిగడం ఖాయమే. వీరిని ఇప్పటికే.. టీఆర్ఎస్ దువ్విపెట్టింది. కావాలంటే ఆర్థిక సాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.
ఇలా మెజార్టీ నియోజకవర్గాల్లో రెబెల్స్ కాంగ్రెస్ గెలుపు అవకాశాల్ని దెబ్బకొట్టేలా చేయడానికి టీఆర్ఎస్ ముఖ్యులు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. రెబెల్స్‌గా పోటీ చేసినా… అధికారంలోకొచ్చిన వెంటనే సముచితమైన స్థానం కల్పించడంతో పాటూ .. .పార్టీ పరంగా అన్నివిధాలుగా అదుకుంటామని హామీలు ఇస్తున్నారు. ఇలా అసమ్మతి నేతలను రెబల్స్‌గా మార్చడం.. టీఆర్ఎస్ లో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలని కేసీఆర్ ప్లాన్ రెడీ చేశారు. ఎంత వర్కవుట్ అవుతుందో కానీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం.. టీఆర్ఎస్ ప్రలోభాలకు సులువుగా లొంగిపోవడం మాత్రం ఖాయమన్న అంచనాలు గాంధీభవన్‌లోనే వినిపిస్తున్నాయి.