మెగా కథానాయికగా చిత్రసీమలో అడుగుపెట్టింది నిహారిక. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ బాగా నిరాశ పరిచాయి. అయితే అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఈలోగా మరో సినిమాని గప్ చుప్‌గా పూర్తి చేసేసింది. ఈ చిత్రానికి ప్రణీత్ దర్శకుడు. ప్రణీత్ అంటే ఎవరో కాదు.. నిహారికతో `ముద్దపప్పు ఆవకాయ్` అనే వెబ్ సిరీస్ తీసిన దర్శకుడు. ఇప్పుడు వెండి తెరపై కాలు మోపాడన్నమాట. రాహుల్ విజయ్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి `సూరేకాంతం` అనే పేరు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అతి త్వరలో ఈ పేరుని అధికారికంగా ప్రకటిస్తారు. ఇందులో నిహారిక పేరు సూరేకాంతం. ఆ పేరుతో ఆమె పడే తిప్పలతో ఈ సినిమాసరదాగా సాగిపోతుందట. ఇది ఓ రకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమా లాంటిదని, కచ్చితంగా ఈ సినిమాతో నిహారిక తొలి కమర్షియల్ హిట్ దక్కించుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. మార్క్ రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే టైటిల్‌తో పాటు, ఫస్ట్ లుక్, టీజర్‌ని కూడా విడుదల చేస్తారు.