ఉప ముఖ్య మంత్రి కేఈ కృష్ణమూర్తి , మంత్రి అయ్యనపాత్రుడు గతం లో టిడిపి-కాంగ్రెస్ పొత్తు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. “రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదు, ప్రజలు బట్టలూడదీసి తంతాారు” అని అయ్యనపాత్రుడు అంటే, “కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటాన”ని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ( https://www.telugu360.com/te/tdp-ministers-against-tdp-relation-with-congress/ )
అయితే రాహుల్-చంద్రబాబు కలయిక తర్వాత మంత్రి అయ్యనపాత్రుడు , “దేశాన్ని మోదీ కబలించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీన్ని అడ్డుకునేందుకు, దేశాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌తో చంద్రబాబు దోస్తీ చేస్తు న్నారు” అంటూ మాట మార్చిన విషయం తెలిసిందే ( https://www.telugu360.com/te/ayyanna-patrudu-statements-before-and-after-alliance-with-congress/ ). ఇక మిగిలిన కేఈ కృష్ణమూర్తి వంతు కూడా ఇప్పుడు పూర్తయింది. ప్రజలకి బహిరంగ లేఖ వ్రాసిన కేఈ, టిడిపి-కాంగ్రెస్ పొత్తును పూర్తి స్థాయిలో సమర్థించుకొచ్చారు. పైగా ఈ నిర్ణయం వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్న విమర్శలని త్రిప్పికొట్టడానికి ప్రయత్నించారు. ఇంతకీ ఆయన ఏమి వ్రాసారంటే ..
“రాహుల్‌గాంధీని చంద్రబాబు కలిస్తే, ఏదో జరిగిపోయిందంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నప్పుడు తర్వాత బీజేపీలో చేరినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? లక్ష్మీపార్వతి జగన్ కాళ్ళ దగ్గర కూర్చుంటే ఎన్టీఆర్ ఆత్మ బాధపడలేదా? టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే మాత్రం ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందా? కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవవస్థలను నిర్వీర్యం చేస్తోంది. బీజేపీ నియంతృత్వ విధానాలను ఎదుర్కోవడానికి ఒక సమగ్రమైన పటిష్టమైన ఫ్రంట్ అవసరం. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా చంద్రబాబు నడుం కట్టారు.”
మొత్తానికి కేఈ కృష్ణమూర్తి కూడా కాంగ్రెస్ పొత్తుని సమర్థించడం తో, ఇక టిడిపి పార్టీ లో అందరూ ఈ పొత్తుని సమర్థించినట్టే అనుకోవాలి. అప్పట్లో “కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటాన”న్న వ్యాఖ్యలు కూడా ఉత్తుత్తి బెదిరింపులేనని, ఇప్పటి రాజకీయ నాయకుల వ్యాఖ్యలని సీరియస్ గా తీసుకోకూడదని, ప్రజలకి తెలిసొచ్చింది.