తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల్లో తీగల కృష్ణారెడ్డి ఒకరు. గ్రేటర్ మేయర్‌గా టీడీపీ తరపున పని చేసిన ఆయన … తన జీవిత లక్ష్యంగా ఎమ్మెల్యే అవ్వాలని పట్టుబట్టి మరీ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి.. గత ఎన్నికల్లో టిక్కెట్ తెచ్చుకున్నారు. 30వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. కానీ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేంలదరికీ టిక్కెట్లు కాన్సెప్ట్ లో భాగంగా కేసీఆర్ తీగలకూ టిక్కెట్ ఇచ్చారు. ఓ వైపు అసమ్మతి.. మరోవైపు ప్రజల నుంచి వ్యతిరేకత తీగలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తన అనుచరుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిపోతున్నారు.
ఇన్నాళ్లు టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జ్గా ఉన్న కొత్త మనోహర్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి రెబల్‌గా పోటీచేస్తానని ప్రకటించారు. సొంత వ్యాపారాలను చక్కబెట్టుకోవడం, కాలేజ్‌లకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం నుంచి రాబట్టుకునేందుకే ప్రయత్నించారు తప్ప.. మహేశ్వరం నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న భావన ఉంది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగేందుకు వెళ్లిన తీగలకు నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తీగల తీరుతో విసుగుచెంది కాంగ్రెస్ లో చేరుతున్నారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఓ వైపు తీగలకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి తనదైన శైలితో ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో ఆమె చేసిన అభివృద్ధికి తోడు భవిష్యత్‌లో చేయాల్సిన పనులపై ప్రజలకు ఆమె స్పష్టమైన హామీలను ఇస్తున్నారు.
టీఆర్ఎస్ క్యాడర్ కొత్త మనోహర్ రెడ్డి వైపు ఉంది. తీగలతో టీఆర్ఎస్లోకి వెళ్లిన టీడీపీ క్యాడర్ … కాంగ్రెస్‌లోకి వెళ్తోంది. దీంతో.. కొత్త మనోహన్ రెడ్డి.. హైకమండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. మహేశ్వరం అభ్యర్థిని మారిస్తేనే టీఆర్ఎస్కు మేలు జరుగుతుందని, లేని పక్షంలో మహేశ్వరం అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ ఖాతాల్లో జమ కావడం ఖాయమని అంటున్నారు. చివరి క్షణంలో.. అయినా బీఫాం.. కేసీఆర్ కొత్త మనోహర్ రెడ్డికి ఇస్తారనే ఆశాభావంతో ఉన్నారు.