“తెలంగాణలో అడుగు పెడితే మా వద్ద ఉన్నరికార్డులు బయటపెట్టి బాబు బండారం బయటపెడతాం ” అంటూ హరీష్ రావు ఘాటు భాషలో చంద్రబాబను హెచ్చరిస్తున్నారు. కేసీఆర్‌ను నమ్ముతారా?…నక్క జిత్తుల చంద్రబాబును నమ్ముతారా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గుంట నక్క చంద్రబాబు అంటూ కేటీఆర్ హుంకరిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందరి టార్గెట్ చంద్రబాబునాయుడే. అందులో హరీష్ రావు లాంటి నేతలు బెదిరింపులు ప్రారంభించి కింది స్థాయి నేతలు.. తిట్లు లంకించుకుంటున్నారు. కేసీఆర్ చంద్రబాబును… వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల.. తెలంగాణలోని సెటిలర్లే… కాదు.. ఇతరుల్లో కూడా వ్యతిరేకత వస్తుందన్న విశ్లేషణలు వస్తున్నా.. టీఆర్ఎస్ నేతలు అసలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
టీఆర్ఎస్ది అసహనమా..?
తెలుగుదేశం పార్టీకి.. తెలంగాణ అర శాతం, ఒక్క శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయని.. ఆ పార్టీని అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని.. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసి పడేశారు. కానీ ఇప్పుడు మాత్రం.. కాంగ్రెస్ పార్టీని అసలు పట్టించుకోవడం లేదు. తన ప్రత్యర్థి చంద్రబాబునాయుడే అన్నంతగా టీఆర్ఎస్ వ్యూహం మార్చుకుంది. దీనికి కారణం.. మహాకూటమి ఏర్పాటు తర్వాత.. తెలంగాణలో మారిపోయిన రాజకీయ పరిస్థితులేనని… రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. మహాకూటమిలో టీడీపీ చేరడంతోనే పరిస్థితి మారిపోయిందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో… ఆ అసహనంతోనే టీఆర్ఎస్ నేతలు చెలరేగిపోతున్నారని… అంటున్నారు. చంద్రబాబు రాజకీయ వ్యూహాలు… ఢిల్లీకి గురి పెట్టినట్లు ఉన్నా.. అవి తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్న అంచనాలో ఉన్నారు. అందుకే చంద్రబాబుపై అసహనానికి గరవుతున్నారంటున్నారు.
తిట్లు, హెచ్చరికలతో రాజకీయ లాభం ఉంటుందా..?
కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం… చంద్రబాబు తెలంగాణలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారని.. దాన్ని తిప్పికొట్టేందుకు అలా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. కూటమిలో ఉన్నారు కాబట్టి.. టీడీపీ అధినేత ఎట్టి పరిస్థితుల్లోనూ మహాకూటమి విజయానికే ప్రయత్నిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అంత మాత్రాన.. కాంగ్రెస్ పార్టీ మొత్తం.. చంద్రబాబు కనుసన్నల్లో ఉంటుందని చెప్పుకోవడం… అవివేకమని … రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి ప్రచారం వల్ల.. ప్రజల్లో చంద్రబాబుకు సానుభూతి వస్తుంది .. కానీ టీఆర్ఎస్కు మేలు చేసే అవకాశం లేదనేది ఎక్కువ మంది వాదన. కాంగ్రెస్ గెలిస్తే… చంద్రబాబు తెలంగాణకు తాగు, సాగునీరు రాకుండా చేస్తారని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం సామాన్యూలకూ వింతగా కనిపిస్తోంది. దిగువ రాష్ట్రం.. ఎగువ రాష్ట్రానికి నీళ్లు ఎలా నిలిపి వేస్తుందన్నది… ఎవరికీ అర్థంకాని ప్రశ్న.
సెంటిమెంట్ పెంచితే ఎవరికి లాభం..!
తెలంగాణ సెంటిమెంట్ అనేది.. ప్రత్యేక రాష్ట్రం రాక ముందు వరకూ… అందిరలోనూ ఉంది. సొంత రాష్ట్రం వచ్చిన ఆ సెంటిమెంట్ ఉంటుందనుకోవడం కష్టమే. చంద్రబాబును చూపించి ఎంత రెచ్చగొట్టినా… తెలంగాణ వాదుల్లోనే అది పెరుగుతుందేమో కానీ.. సామాన్యుల్లో పెరగదు. ఆ తెలంగాణ వాదులందరూ.. ఎలా చూసినా టీఆర్ఎస్కే సపోర్టర్లు. మరి అలాంటప్పుడు.. చంద్రబాబుపై తిట్లు, హెచ్చరికలు చేయడం వల్ల… సీమాంధ్రులు, తటస్థుల్లో మాత్రం.. సెంటిమెంట్ పెంచుకుంటారు. దీని వల్ల అంతిమంగా కాంగ్రెస్‌కే లాభం వస్తుంది కానీ.. టీఆర్ఎస్ కు కాదు. ఈ విషయాలన్నీ తెలిసీ.. చంద్రబాబును టార్గెట్ చేసుకుంటున్నారో.. లేక అసహనాన్ని అపుకోలేకపోతున్నారో టీఆర్ఎస్ నేతలకే తెలియాలి..!
— సుభాష్