కమ్యూనిస్టు పార్టీలు.. తెలంగాణలో తమ రాజకీయ పోరాటాల్ని వేరువేరుగా చేసుకుంటున్నాయి. సీపీఐ కాంగ్రెస్, టీడీపీ, టీజేఏస్లతో కలిసి మహాకూటమిగా ఎర్పడింది. సీపీఎం మాత్రం.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనే కూటమిని ఏర్పాటు చేసుకుని విడిగా పోటీ చేస్తోంది. జనసేనను కూడా ఈ కూటమిలో ఆహ్వానించారు. పొత్తు కోసం… సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. తమ్మినేని వీరభద్రానికి పవన్ కల్యాణ్ కనీసం కలిసే చాన్స్ కూడా ఇవ్వలేదు. దాంతో.. తెలంగాణ విషయం మరుగున పడిపోయింది. ఇప్పుడు… ఏపీలో పొత్తులపై చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాలు .. తెలంగాణతో పొత్తు సంగతేమో కానీ.. ఏపీలో మాత్రం తమ పయనం.. జనసేనతో పాటే ఉంటుందని… రెండు కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులు ముక్త కంఠంతో చెబుతున్నారు.
తెలంగాణలోలా.. ఏపీ కమ్యూనిస్టులు.. సీపీఐ, సీపీఎం విడివిడిగా పోవడం లేదు. పోరాటాలు సహా.. అన్నీ కలసి కట్టుగానే చేస్తున్నారు. సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ ఏదైనా కలిసే చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలసి పని చేస్తున్నారు. మొదట… దేని గురించి చెప్పాల్సి వచ్చినా.. పవన్ కల్యాణ్.. కమ్యూనిస్టుల గురించి చెప్పేవారు. రేపు వెళ్లి కమ్యూనిస్టులతో భేటీ అయి ఆ తర్వాత పోరాట ప్రణాళిక సిద్దం చేసుకుంటామని చెప్పేవారు. మొదట్లో కొన్ని కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్.. కమ్యూనిస్టుల్ని పట్టించుకోవడం మానేశారు. వారు ఏ కార్యక్రమం పెట్టినా పవన్ కల్యాణ్ ను పిలుస్తారు. కానీ పవన్ వెళ్లారు. జనసేన ఏ కార్యక్రమం పెట్టినా కమ్యూనిస్టుల్ని పిలవరు.. కానీ వాళ్లు వెళ్తారు. అంటే… కమ్యూనిస్టు పార్టీలే పవన్ కల్యాణ్ వెంట వెళ్లేందుకు ఉత్సాహ పడుతున్నాయి.
మధ్యలో ఓ ప్రత్యామ్నాయ వేదిక పెడుతున్నామని.. దానికి పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు కూడా. కానీ పవన్ కల్యాణ్ టెంప్ట్ కాలేదు. ఆయన దోవలోనే ఆయన వెళ్తున్నారు. కానీ కమ్యూనిస్టు పార్టీ నేతలు మాత్రం ఆశలు వదులుకోవడం లేదు. పవన్ కల్యాణ్‌తో కలిసే వెళ్తామని.. ఇప్పటికీ నమ్మకం ఉందని.. తాజాగా సీపీఐ నేత నారాయణ ప్రకటించారు. బీజేపీ, వైసీపీతో వెళ్తే మటుకు … జనసేన జోలికి పోబోమంటున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు ఇంత వరకూ పవన్ కల్యాణ్ నోటి వెంట… కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల పోరాటం చేస్తామన్న ఒక్క మాట కూడా రాలేదు. జగన్ , బీజేపీపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారు కానీ.. వాటితోనూ కలిసి పోటీ చేస్తామని చెప్పడం లేదు. అన్ని స్థానాల్లో పోటీ చేసి బలం నిరూపిస్తామని అంటున్నారు .. కలసి వస్తామంటున్న కమ్యూనిస్టుల గురించి కనీస ప్రస్తావన కూడా చేయడం లేదు. అంతే కాదు.. విజయవాడలో పార్టీ కార్యాలయ ఆవిర్భావ కార్యక్రమంలో చివరికి కమ్యూనిస్టులు చంద్రబాబు వైపే వెళ్తారని వ్యాఖ్యానించారు. దాంతో.. కమ్యూనిస్టు పార్టీ నేతలు.. పవన్ ను కలిసి… తమ రాజకీయ కార్యాచరణలో అసలు టీడీపీ లేనే లేదని చెప్పుకొచ్చారు. కానీ పవన్ కు నమ్మకం కుదరలేదు. దాంతో.. జనసేన విషయంలో వామపక్షాల లవ్.. వన్ సైడ్‌గానే ఉంది.