వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఓ సెటైర్ ఉంది. ఆకలితో అలమటించేవాళ్లు ఎదురొచ్చినా… తను సీఎం అవగానే పంచభక్ష్య పరమాన్నాలు పెట్టిస్తానని.. హామీ ఇస్తారని చెబుతూంటారు. అంతా ఆయన సీఎం పదవి కోసం స్టిక్ అయిపోయారని.. వైసీపీ నేతలు.. ఇతర పార్టీలు నేతలు కూడా చెబుతూంటారు. జగన్కు తోడుగా ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ముఖ్యమంత్రి పదవి జపం చేస్తున్నారు. తనది పాతికేళ్ల రాజకీయం అని .. ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి లాంటి పదవులు వద్దని ఆరు నెలల కిందటి వరకూ చెబుతూ వచ్చిన ఆయన.. కర్ణాటక ఎన్నికల తర్వాత… “నేను సీఎం అవుతానని” ప్రకటించడం ప్రారంభించారు. మెల్లగా.. ఆ నినాదాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు.. అభిమానులు ఎవరైనా సీఎం.. సీఎం అని అరిస్తే కసురుకునేవారు. కానీ ఇప్పుడు.. అడిగి మరీ అలా పిలిపించుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్ నోటి వెంట.. ముఖ్యమంత్రి పదవి గురించిన మాట పదే పదే వస్తోంది. తనను ఒక్క సారి ముఖ్యమంత్రిని చేయండి.. ఆ తర్వాత సరిగ్గా పని చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయం అని ప్రజలకు ఆఫర్ ఇచ్చేశారు. యువతరం మొత్తం తన వెనుక ఉందని.. వాళ్లే తనని ముఖ్యమంత్రిని చేస్తారని ప్రకటించుకున్నారు. ఆదివారం జగ్గంపేటలో పోరాటయాత్ర చేసిన పవన్ కల్యాణ్… తను ముఖ్యమంత్రి కావడానికి మరో మార్గం ఉందని ప్రకటించుకున్నారు. “పవన్ సీఎం కావాలన్న” నినాదం ఒక మహామంత్రమన్నారు. అదే తనను వచ్చే ఎన్నికల అనంతరం సీఎం పదవిలో కూర్చోపెడుతుందని ప్రకటించారు.
ఓ వైపు జగన్మోహన్ రెడ్డి.. రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ.. క్యాంపెన్ ప్రారంభించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్… “పవన్ సీఎం కావాలన్న” తారక మంత్రాన్ని జపిస్తున్నారు. మొత్తానికి ఇద్దరు నేతలు.. ముఖ్యమంత్రి పదవి కోసం.. హీరోచితమైన ప్రకటనలు చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. కానీ ఇద్దరూ కలసి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే… ఎవరు సీఎం అవుతారన్నది.. చాలా మంది ఊహాలకు అందని లాజిక్. వీరిద్దరికీ కలిసి పోటీ చేయాలని లేకపోయినా… మన్మధుడు సినిమాలో.. బ్రహ్మానందం పరిస్థితిలా.. బీజేపీ కలసి పోటీ చేయించాలని నిర్ణయించుకుంది.. అందుకే పోటీ చేయాల్సి వచ్చిందన్నట్లుగా పరిస్థితి వస్తే ఏం చేస్తారన్నది..మిలియన్ డాలర్ క్వశ్నన్..!