టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తెలంగాణ ఎన్నికల గురించి రోజుకు అరగంట సమయం అయినా ఆలోచిస్తున్నారో లేదో కానీ… తెలంగాణ ఎన్నికలు మొత్తం 24/7 చంద్రబాబు చుట్టూనే తిరుగుతున్నాయి. ఎక్కడ ఏం జరిగినా.. అదంతా చంద్రబాబుకే చుట్టేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలందరూ… చంద్రబాబు జపమే చేస్తున్నారు. ఆయననే బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కూటమి గెలిస్తే… నీళ్లు ఆగిపోతాయని.. కరెంట్ రాదని.. ఇంకోటని…ఏదేదో చెబుతున్నారు. అవన్నీ పోను.. కొత్తగా ఇప్పుడు… కాంగ్రెస్ నేతలు చేసే ఆరోపణలను కూడా.. చంద్రబాబు ఖాతాలో వేసేందుకే ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
గజ్వేల్లో కేసీఆర్ను ఓడించేందుకు హరీష్ రావు తనకు ఆర్థిక సాయం చేస్తాననన్నారని ప్రకటించిన కాంగ్రెస్ నేత .. వంటేరు ప్రతాప్ రెడ్డిని టీఆర్ఎస్ నేతలు ఏమీ అనలేకపోతున్నారు. ఆయన డిపాజిట్లు గల్లంతు చేస్తానని… ప్రతిగా సవాల్ చేసిన హరీష్ రావు.. ఇప్పుడు నేరుగా… వాటిని తీసుకొచ్చి చంద్రబాబుకు అంటిస్తున్నారు. వంటేరు ప్రతాప్ రెడ్డితో చంద్రబాబే అలా చెప్పించారంటూ… హరీష్ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. దానికి తోడు.. హరీష్ కూడా.. ఆ ఎఫెక్ట్ తీసుకు రావడానికి చంద్రబాబు ఖబడ్దార్ అనే ప్రకటనలూ చేస్తున్నారు.
టీఆర్ఎస్ నేతల తీరు చూస్తూంటే.. కలలో కూడా వాళ్లు చంద్రబాబును కలవరిస్తున్నారని.. టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జాతీయ రాజకీయ కూటములతో పాటు… జిల్లాల్లో టీడీపీ పరిస్థితిని చక్కదిద్దుకుని.. అభ్యర్థులను రెడీ చేసుకునే ప్రయత్నంలో చంద్రబాబు తీరిక లేకుండా ఉన్నారు. ఓ వైపు అధికారిక కార్యక్రమాలు, మరో వైపు.. పార్టీ కార్యక్రమాలకు తోడుగా.. ఇప్పుడు.. జాతీయ స్థాయిలో బీజేపీని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పనులన్నింటి మధ్య.. ఆయన తెలంగాణ టీడీపీ నేతలతో మాట్లాడే సమయమే చిక్కడం లేదని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ.. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్ని శాసిస్తున్నారని… చంద్రబాబు పేరు వింటేనే టీఆర్ఎస్ నేతలు భయపడిపోతున్నారని… సెటైర్లు వేస్తున్నారు. రేపు ఒకటి రెండు రోజులు చంద్రబాబు ప్రచారం చేస్తే.. ఇక శివాలెత్తి పోతారేమోనని… టీఆర్ఎస్ నేతలపై టీడీపీ నేతలు విసర్లేస్తున్నారు.