రచయిత బుర్రా సాయిమాధవ్‌కి ఓ సెంటిమెంట్ ఉంది. దాదాపుగా ఆయన తను మాటలు రాసిన సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషిస్తుంటారు. తాజాగా `ఎన్టీఆర్` బయోపిక్‌కీ ఆయన సంభాషణలు అందిస్తున్నారు. ఇందులోనూ ఆయనకు ఓ కీలకమైన పాత్ర దక్కింది. ఎన్టీఆర్‌కి వ్యక్తిగత మేకప్ మేన్‌గా పనిచేసిన వ్యక్తి పీతాంబరం. ఎన్టీఆర్ – పీతాంబరం మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్‌కి తొలిసారి మేకప్ వేసింది పీతాంబరమే. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేంత వరకూ పీతాంబరమే మేకప్ మెన్. అంతేకాదు.. తమిళనాట ఎమ్జీఆర్కీ పీతాంబరమే మేకప్వేసింది. అటు ఎన్టీఆర్, ఇటు ఎమ్జీఆర్ ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. అలా ఇద్దరు ముఖ్యమంత్రులకు మేకప్ వేసిన అరుదైన ఘనత పీతాంబరం దక్కించుకున్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లకు తప్ప మరో కథానాయకుడకు పీతాంబరం మేకప్ వేయలేదు. ఇప్పుడు ఈ పాత్రనే… బుర్రా సాయిమాధవ్పోషిస్తున్నారు. కీలకమైన సన్నివేశాల్లో ఎన్టీఆర్‌తో పాటు పీతాంబరం కూడా కనిపిస్తారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.