సావిత్రిలాంటి నటీమణికి రీప్లేస్మెంట్లు ఉండవు. రిప్లికాలు తయారు చేయలేం. అందుకే మహానటి బయోపిక్ తీస్తున్నప్పుడు సావిత్రిగా ఎవరు నటిస్తారన్నది దర్శక నిర్మాతలకు పెద్ద సవాల్‌గా మారింది. కీర్తి సురేష్ ని ఆ పాత్రకోసం ఎంపిక చేసినప్పుడు చాలా నిష్టూరాలు వినిపించాయి. అయితే… వాటన్నింటికీ కీర్తి తనదైన నటనతో సమాధానం చెప్పగలిగింది. ఇప్పుడు మరో సావిత్రి వస్తోంది.. `ఎన్టీఆర్` బయోపిక్ ద్వారా. తనే.. నిత్యమీనన్. నిజానికి `మహానటి`లో సావిత్రి పాత్రకు ముందుగా నిత్యనే సంప్రదించారు. కానీ కొన్ని `ఈగో` సమస్యల వల్ల నిత్య ఆ పాత్రని వదులుకుంది. అయితే `ఎన్టీఆర్` బయోపిక్ అవకాశం వచ్చినప్పుడు మాత్రం గట్టిగానే పట్టుకోగలిగింది. ఇందులో నిత్య కనిపించే సన్నివేశాలు రెండు మూడే. కానీ… అవి కథలో చాలా కీలకమైన ఘట్టాల్లో వస్తాయి. అందుకే నిత్య పాత్రకు అంత ప్రాధాన్యం.
నిత్య ఎంత సేపు కనిపిస్తుంది? అనేది పక్కన పెడితే… సావిత్రిగా నిత్య బాగా నటించిందా? కీర్తి బాగా చేసిందా? అనే పోలిక రావడం సర్వసాధారణం. రెండు మూడు సన్నివేశాలు చూసి ఓ నటి ప్రతిభని అంచనా వేయలేం గానీ – మహానటి చూసిన తరవాత, మరో సావిత్రి వస్తోందంటే కచ్చితంగా పోలికలు తీయకుండా ఉండలేరు. ఆ ఒడ్డూ, పొడవూ, శరీర సౌష్టవం ఈ విషయాల్లో సావిత్రికి అత్యంత దగ్గరగా ఉంటుంది నిత్య. పైగా మంచి నటి. కాబట్టి కనిపించేది రెండు సన్నివేశాలైనా తనదైన ముద్ర వేయగలదు. క్రిష్ కూడా నిత్య కోసం అలాంటి సన్నివేశాలే సృష్టించార్ట. ఈ సంక్రాంతికి `ఎన్టీఆర్` వచ్చేస్తున్నాడు. సావిత్రికి సరైన రిప్లికా కీర్తీనా, నిత్యనా అని చెప్పవలసింది తెలుగు ప్రేక్షకులే.