జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరచూ ఓ మాట అంటూ ఉంటారు. తన మద్దతు వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని పదే పదే చెబుతూ ఉంటారు. తను మద్దతు ఇవ్వకపోతే.. చంద్రబాబు రిటైరై ఉండేవారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇది మరీ ఎక్కువైపోయింది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేశారు. పవన్ కల్యాణ్ ఆ కూటమికి మద్దతు ప్రకటించారు.
పవన్ మద్దతు ఇవ్వని వాళ్లు రిటైరైపోయారా..?
పవన్ కల్యాణ్ మద్దతు.. గత ఎన్నికల్లో… తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడింది…అందులో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు మద్దతు ఇచ్చినా చంద్రబాబు రెండు శాతం ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. అయితే.. పవన్ కల్యణ్ మద్దతు ఇవ్వకపోయి ఉంటే… చంద్రబాబు రాజకీయంగా రిటైర్ అయి ఉండేవారా..?. అంత తేలిగ్గా ఎవరూ రిటైర్ కారు. గత ఎన్నికల్లో జగన్‌కు.. పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వలేదు. మరి రిటైర్ కాలేదు కదా..!. కాంగ్రెస్ వాళ్లకు… పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వలేదు.. మరి వాళ్లు కూడా రిటైర్ కాలేదు కదా..!. పవన్ కల్యాణ్… మద్దతు .. తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడింది. అది ఎంత శాతం ఉపయోగపడింది.. ఈ జమాలెక్కలు తీయడం ఎవరి వల్ల కాదు. తెలుగుదేశం పార్టీ నేతలు.. చాలా బలమైన వాదన చాలా కాలంగా వినిపిస్తున్నారు. బీజేపీతో, జనసేనతో పొత్తులు పెట్టుకోక ముందే జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా.. టీడీపీ ఘన విజయం సాధించింది. అందుకే… పవన్ కల్యాణ్ మద్దతు లేకపోయినా తాము విజయం సాధించేవాళ్లమంటున్నారు. పవన్ కల్యాణ్‌కు అంత అద్భుతమైన బలం ఉంటే.. ఆయనే పోటీ చేయవచ్చు కదా..తమకు ఎందుకు మద్దతివ్వడం అని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు గెలిచే పరిస్థితి లేకపోతే పవన్ మద్దతిచ్చేవారా..?
బేసిక్‌గా.. చంద్రబాబు నాయుడు గెలిచే వాతావరణం లేకపోతే.. పవన్ కల్యాణ్ మద్దతిచ్చేవారా..?. చంద్రబాబు ఓడిపోతారని.. అంచనా వేస్తే పవన్ కల్యాణ్ కూడా మద్దతిచ్చేవారు కాదేమో..! అందుకే ఎన్నికల్లో గెలవడానికి ఏ ఒక్క అంశమో కారణం కాదు. అనేక అంశాలు కారణం అవుతాయి. 2014లో చంద్రబాబు గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోవడం… విడిపోయిన రాష్ట్రానికి.. చంద్రబాబు లాంటి నాయకుడు రాష్ట్రానికి ఉండాలనుకోవడం.. ప్రధానంగా కలసి వచ్చిన అంశం. అలాగే.. విభజన తర్వాత కేంద్రం మద్దతు లేకుండా.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు.. అనే భావన ప్రజల్లోకి వెళ్లింది. అలాంటి భావన వచ్చినప్పుడు.. కేంద్రంలో గెలిచే పార్టీగా అప్పటికే ప్రచారం పొందుతున్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లాభం కలిగించింది. జగన్మోహన్ రెడ్డికి నష్టం చేకూరింది. అప్పటికే… దేశవ్యాప్తంగా మోడీ అనుకూల వాతావరణం ఏర్పడింది. అయితేఈ విషయంలో జగన్ వ్యూహత్మక తప్పిదం చేశారు. ఎవరు ప్రత్యేకహోదా ఇస్తే వారికే మద్దతిస్తాననే విధానం పెట్టుకున్నారు. చంద్రబాబు నేరుగా మోడీతో పొత్తు పెట్టుకున్నారు. విభజన హామీలు నెరవేరుస్తామని మోడీ హామీ ఇచ్చారు. అప్పటికే దేశవ్యాప్తంగా.. మోడీ అధికారంలోకి వస్తాడన్న వాతావరణం ఏర్పడింది. ఈ విషయంలో జగన్ కన్నా.. చంద్రబాబు చురుగ్గా రాజకీయ వ్యూహం అమలు చేశారు.
చంద్రబాబు గెలుపులో పవన్‌కు కూడా పాత్ర ఉందా..?
తెలుగుదేశం పార్టీ చేసిన సోషల్ ఇంజినీరింగ్ కూడా… టీడీపీ విజయం కీలక పాత్ర పోషించింది. కాపు రిజర్వేషన్లకు అనుకూలమైన హామీ.. కార్పొరేషన్ పేరుతో కాపు సామాజికవర్గానికి సాయం చేయడం.. దీనితో పాటు పవన్ కల్యాణ్ మద్దతివ్వడం కూడా ఓ అంశం కావొచ్చు. పీఆర్పీ ప్రయోగం విపలం కావడంతో… కాపు ఓట్లు ఎటు వేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పవన్ కల్యాణ్.. వారిని టీడీపీ వైపు మళ్లించారనుకోవచ్చు. ఎలా చూసినా… తెలుగుదేశం పార్టీ.. ఈ సోషల్ ఇంజినీరింగ్ సమర్థవంతంగా చేయగలిగిలింది. అందువల్ల కలసి వచ్చిన అనేక అంశాల్లో.. టీడీపీ విజయం సాధించింది. ఎన్నికల్లో ఏ ఒక్క అంశంపైనో గెలుస్తామనుకోవడం పొరపాటు. అందులో పవన్ కల్యాణ్.. పాత్రే లేదని.. తెలుగుదేశం అంటే తప్పు. పవన్ కల్యాణ్ పాత్రే లేకపోతే.. ఎందుకు ప్రచారం చేయించుకున్నారు..? .
టీడీపీ – పవన్ ఇద్దరూ చేసుకోకూడని వాదనలు చేసుకుంటున్నారా..?
తెలుగుదేశం పార్టీ నేతలు టీడీపీ విజయంలో పవన్ కల్యాణ్ పాత్ర లేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. టీడీపీకి కలసి వచ్చిన అనేక అంశాల్లో పవన్ కల్యాణ్ ఒకరు. దీన్ని అంగీకరిస్తే.. హుందాగా ఉంటుంది. అలాగే పవన్ కల్యాణ్ కూడా.. పదే పదే నా వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారంటూ.. చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి సమయంలో.. నువ్ ఎందుకు గెలిపించావనే ప్రశ్న వస్తుంది. ఏపీని బాగు చేయాలనే సంకల్పం ఉంటే.. ఇంకెవరికో మద్దతు ఇచ్చి బాగు చేయించడం ఎందుకు…నువ్వే బాగు చేయించవచ్చు.. కదా అన్న ప్రశ్న వస్తుంది. 2014 ఎన్నికల్లో ఎందుకు పోటీచేయలేదు.. అన్న ప్రశ్న వస్తుంది. అందుకే పవన్ కల్యాణ్… పదే పదే తన వల్లే సీఎం అయ్యారని చెప్పుకోకపోవడమే మంచిది. అలా చెప్పుకోకపోవడం వల్ల ఆయనకు మద్దతు పెరుగుతుంది. చెప్పుకోవడం.. వల్ల పవన్ వల్లే చంద్రబాబు గెలిచారని ఎవరూ అనుకోరు. చెప్పుకోకపోవడం వల్ల పవన్ కల్యాణ్ పాత్ర లేదని ఎవరూ అనుకోరు. కచ్చితంగా… చంద్రబాబు విజయంలో పవన్ పాత్ర ఉంది. అయితే పవన్ వల్లే గెలిచారని చెప్పుకోవడం కరెక్ట్ కాదు.