తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రసంగాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడమే ప్రముఖంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే! అయితే, సెటిలర్ల దగ్గరకి వచ్చేసరికి ఏమన్నారు… రాజకీయాలు అన్నాక చంద్రబాబు నాయుడు మీద తాము విమర్శిస్తామనీ, తమ మీద ఆయన విమర్శిస్తారనీ, ఇవన్నీ అత్యంత సహజమంటూ సెటిలర్లకు రుచించే విధంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే, తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్తే… అక్కడ చంద్రబాబు మీద విమర్శపై మాత్రమే ప్రధానంగా ఆయన ప్రచారం సాగిస్తున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్, టీడీపీల పొత్తుపై విమర్శలు చేశారు కేటీఆర్.
అవినీతి అనకొండ సోనియా గాంధీ అనీ, సోనియా గాంధీ కాదనీ గాడ్సే అనీ, ఆమె ఇటలీ మాఫియా అనీ, సోనియా దేశానికి పట్టిన శని… ఇవన్నీ చంద్రబాబు నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలు అని గుర్తుచేశారు కేటీఆర్. ఇలాంటి విమర్శలు చేసినవారితో పొత్తు పెట్టుకోవడమేంటని కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నించారు. మీ నాయకురాలు సోనియా పరువుదీసే విధంగా అన్నేసి మాట్లన్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారన్నారు. అంతేకాదు, రాహుల్ గాంధీని కలిసేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి పొత్తు పెట్టుకున్నారనీ, ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరు ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. ఢిల్లీలో చంద్రబాబు గది ముందు వీళ్లంతా చేతులు కట్టుకుని నిలబడ్డారనీ, కాంగ్రెస్ సిపాయిలనుకునే ప్రముఖ నేతలంతా అక్కడ పిల్లులు అయిపోయారన్నారు. ఇందుకేనా తెలంగాణ వచ్చిందనీ, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ టిక్కెట్లు డిసైడ్ చేసిది ఎవరంటే… చంద్రబాబు నాయుడు అని కేటీఆర్ ఆరోపించారు.
కేటీఆర్ వ్యూహాత్మక ప్రచారం ఏంటంటే… సెంటిమెంట్ ను ఎలాగోలా పైకి తేవడం. టీడీపీతో కాంగ్రెస్ కలిసింది కాబట్టి, ఆ పొత్తుపై ఈ తరహా విమర్శలు చేయడం వెనక అసలు ఉద్దేశం అదొక్కటే. టీడీపీని తెలంగాణ వ్యతిరేకిగా వీలైనంత బలంగా విమర్శించి, దాన్లో భాగాన్ని కాంగ్రెస్ కి అంటగట్టాలని చూస్తున్నారు. అందుకే, ఏకంగా కాంగ్రెస్ టిక్కెట్లను డిసైడ్ చేసేది కూడా చంద్రబాబు నాయుడే అని విమర్శిస్తున్నారు! వాస్తవంగా, టీడీపీకి కాంగ్రెస్ ఇంత చొరవ ఎందుకు ఇస్తుంది..? మహా కూటమిలో టీడీపీకి అంతటి స్వేచ్ఛ ఉందని ప్రజలు కూడా అనుకోవడం లేదు. కూటమిలో కాంగ్రెస్ తరువాతి మూడు పార్టీల్లో టీడీపీ ఒకటి.. అంతేగానీ. కాంగ్రెస్ తరువాతి, లేదా దానికి సమాన స్థాయి టీడీపీకి సాధ్యమా..?