కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్ధన్ రెడ్డి శకం దాదాపుగా ముగిసిపోయింది. ఆయన కంచుకోటగా మార్చుకున్న బళ్లారిలో ఇప్పుడు.. .బీజేపీ వైపు చూసే వారు కరవవుతున్నారు. అభ్యర్థిని నిలబెట్టి ప్రచారం చేయకపోయినా గెలుస్తారని గొప్పగా చెప్పుకునే బళ్లారికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉగ్రప్ప… రెండున్నర లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి అని చెప్పుకున్నా.. బళ్లారి ఏరియాలో… జేడీఎస్ కు ఎలాంటి బలం లేదు. అక్కడ కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి. లోక్ సభ నియోజకవర్గం మొత్తం మీద జేడీఎస్ కు 20 నుంచి 30 వేల ఓట్లు మాత్రమే వస్తూంటాయి. కానీ…గత లోక్ సభ ఎన్నికల్లో గాలి జనార్ధనరెడ్డి కుడి భుజం శ్రీరాములు సాధించిన మెజార్టీ 80వేలు. ఇప్పుడు అదంతా మైనస్ కాగా.. కాంగ్రెస్ పార్టీకి రెండున్నర లక్షల మెజార్టీ వచ్చింది.
బీజేపీ తరపున పోటీ చేసింది కూడా..శ్రీరాములు సోదరి శాంతనే. అయినా గెలిపించుకోలేకపోయారు. బళ్లారిలోకి అడుగు పెట్టేందుకు గాలి జనార్ధన్ రెడ్డికి అనుమతి లేదు. అయినా.. బళ్లారి జిల్లా శివారులో మకాం వేసి ఉపఎన్నికలను పర్యవేక్షించినా ప్రయోజనం లేకపోయింది. 2004 నుంచి బళ్లారి పార్లమెంట్ స్థానాన్ని శాసిస్తున్న బీజేపీ కంచుకోట బద్దలైపోయింది. నిజానికి గాలి వర్గం రాజకీయంగా ప్రభావం కోల్పోతోందని.. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయింది. బళ్లారి జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉండగా 6 స్ధానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కేవలం మూడు చోట్ల మాత్రమే.. గాలి వర్గీయులు విజయం సాధించగలిగారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీరాములు ప్రయత్నించారు. ఆ ఆడియో టేపులు కూడా కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది.అవన్నీ కలిసి ఇప్పుడు.. గాలి వర్గీయుల రాజకీయంపై కర్ణాటక ప్రజలకు విరక్తి తెప్పించిటన్లయింది. రాజకీయంగా పట్టు లేకపోతే… బీజేపీ కూడా.. గాలి వర్గాన్ని ఏ మాత్రం భరించే అవకాశం ఉండదు.ఇక వారికి బీజేపీలోనూ ప్రాధాన్యం దక్కడం కష్టమే కావొచ్చని కర్ణాటక రాజకీయవర్గాల అంచనా. అంటే.. ఓ రకంగా గాలి వర్గం రాజకీయంగా అంతిమ దశకు చేరుకున్నట్లే..!