కడపలో ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమ ఏర్పాటుకు రూ. 18 వేల కోట్లు అవుతాయనే అంచనాకి వచ్చారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఓరకంగా ఇది సాహసోపేతమైన నిర్ణయమే అనాలి. ఎందుకంటే, కడప కర్మాగారం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మెలికలు పెడుతూనే ఉంది. ఇక్కడ ఫ్యాక్టరీ సాధ్యం కాదంటూ ఆ మధ్య సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేశారు. కానీ, కేంద్రం సిద్దంగా ఉందనీ, రాష్ట్రమే సరైన నివేదికలు ఇవ్వకపోవడం వల్ల నిర్మాణం ఆలస్యమౌతోందంటూ.. రాష్ట్రంలో భాజపా నేతలు సన్నాయి నొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రమే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం, నెల రోజుల్లోపే శంకుస్థాపన కూడా చేసేస్తామంటూ మంత్రి వర్గం చెప్పడం కీలక పరిణామమే.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఫ్యాక్టరీ నిర్మిస్తామనీ అంటున్నారు. అంతేకాదు, ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మూడు లేఖలు రాయాలని క్యాబినెట్ నిర్ణయించింది. కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేస్తూ మొదటి లేఖ రాస్తారని సమాచారం. ఈ మేరకు కేంద్రం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ రెండో లేఖ, మూడో లేఖలో.. విభజన చట్టంలోని ఇతర హామీలను కూడా ప్రస్థావిస్తూ, వాటిని నెరవేర్చలేదంటూ కేంద్రంపై నిరసన తెలుపుతారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కేంద్రం అడ్డుకోలేదనే అంశాన్ని కూడా ఈ లేఖల్లోనే ప్రస్థావిస్తారని తెలుస్తోంది.
కడప ప్లాంట్ నిర్మాణం దిశగా ముందుగా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా నిధుల సేకరణ.. అంటే, ఈక్విటీకి వెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అలా వచ్చిన నిధుల లెక్కల్ని సరిచూసి… పెట్టుబడికి ఇంకా నిధులు చాలవు అనే పరిస్థితి ఉంటే… అప్పుడు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కోరే అవకాశం ఉందని సమాచారం. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం చొరవ ప్రశంసనీయమే. అయితే, ఉక్కు కర్మాగారం నిర్మాణానికి సంబంధించి కొన్ని కీలక అనుమతులు కేంద్రం పరిధిలో ఉంటాయి. అంతవరకూ వచ్చేసరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. పోనీ, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. మరి, ఇలాంటి నేపథ్యంలో శంకుస్థాపన వరకూ ఓకేగానీ.. ఆ తరువాత పరిస్థితిని ముఖ్యమంత్రి ఎలా డీల్ చేస్తారనేదే ఆసక్తికరం.