రాజన్నసిరిసిల్లా జిల్లా వేములవాడ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్… అసలు ఇండియాలో కంటే.. జర్మనీలోనే ఎక్కువ ఉంటారన్న ప్రచారం ఉంది. ఆయనపై పౌరసత్వ వివాదం కూడా ఉంది. ఆయన జర్మనీ పౌరుడేనని.. కేంద్ర హోంశాఖ కూడా తేల్చింది. కానీ దానిపై అప్పీల్ మీద అప్పీల్‌కు వెళ్తూ… ప్రస్తుతానికి నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచుకుంటున్నారు. బీజేపీలో చాలా పెద్ద స్థాయిలో చెన్నమనేని రమేష్‌కు బంధువులు ఉన్నారు. నిజానికి ఓ ఆరు నెలల క్రితం.. ఆయనకు భారత పౌరసత్వం లేదని కేంద్ర హోంశాఖ తేల్చడంతో… అనర్హతా వేటు పడటం ఖాయమని… వేములవాడ నుంచి కేసీఆర్ మరో మేనల్లుడు… సంతోష్‌ను బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. కానీ.. అప్పీల్‌కు వెళ్లి ఆ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టించుకోగలిగారు రమేష్. ఇప్పుడు సిట్టింగులందరికీ టిక్కెట్ల కోటాలో ఆయనకు మళ్లీ టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్.
కానీ చెన్నమనేని రమేష్‌పై టీఆర్ఎస్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. వారు సహకరించకపోయినా రమేష్ తన మానాన తను ప్రచారం చేసుకుంటున్నారు. కేటీఆర్ ఓ సారి వచ్చి కార్యకర్తలందర్ని సమన్వయం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ మాట వినడం లేదు. వేములవాడ నుంచి జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమకు టిక్కెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ క్యాడర్ పట్టుబడుతోంది. మరో వైపు కూటమి నుంచి ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి గత టికెట్ దక్కకపోవడంతో ఆది శ్రీనివాసం బీజేపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. మూడు వేల ఓట్ల తేడాతో విజయాన్ని కోల్పోయారు. తర్వాత మళ్లీ ఆయన కాంగ్రెస్ లో చేశారు. చెన్నమనేని రమేష్ కి భారత పౌరసత్వం లేదని.. ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తోంది ఆది శ్రీనివాసే.
నిజానికి ఆది శ్రీనివాస్ ది మొదటి నుంచి కాంగ్రెస్ వ్యక్తే. వైఎస్ హయాంలో రెండుసార్లు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ గా నియమించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచీ పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెన్నమనేని రమేష్‌పై కేవలం 1800 ఓట్ల తేడాతో చెన్నమనేని రమేష్ పై ఓడిపోయారు.. ఆ తరువాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చెన్నమనేని రమేష్… రాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి .. భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆది శ్రీనివాస్ వైసీపీలోకి వెళ్లారు. అయితే తెలంగాణాలో ఆ పార్టీ కనుమరుగు కావడంతో 2014 ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని గట్టిగా ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయన రాకని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అధిష్టానం కూడా పొన్నం మాటని కాదనలేక ఆది శ్రీనివాస్ కి మొండిచేయి చూపించింది. దీంతో గత్యంతరం లేక ఆది శ్రీనివాస్ బీజేపీలో చేరి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తర్వాత వేములవాడ ఎమ్మెల్యే రమేష్ పౌరసత్వంపై అలుపెరగని పోరాటం చేసి కోర్టులో విజయం సాధించారు.
అయితే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరడం ఏనుగు మనోహర్ రెడ్డికి ఏమాత్రం ఇష్టంలేదు. ఈఎన్నికల్లో వేములవాడ అసెంబ్లీ స్థానం తనకేనని భావించిన మనోహర్ రెడ్డి గడిచిన రెండేళ్ల నుంచి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కానీ బీసీలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి.. ఆ కోటా కింద ఆది శ్రీనివాస్‌కు .. సీటు దాదాపు ఖరారయినట్లేనంటున్నారు. బీజేపీ తరపున ప్రతాపరామకృష్ణను అభ్యర్థిగా ప్రకటించారు. గతంలో బీజేపీ నుంచి పోటీచేసిన అభ్యర్థే రెండో స్థానంలో నిలిచారని ఈసారి తనను గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న కొద్దీ నియోజకవర్గంలో ఉత్కంఠ పెరుగుతోంది.