కర్ణాటక ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో.. చంద్రబాబు ఉత్సాహంగా ఉన్నారు. డిసెంబర్ 11న వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఇప్పట్నుంచే మరింత దూకుడుగా.. కూటమి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గురువారం… బెంగళూరు, చెన్నైలకు వెళ్తున్నారు. గురువారం ఉదయం బెంగళూరులో కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడను కలుస్తారు. మధ్యాహ్నం తరువాత చెన్నై వెళ్లి డీఎంకే అధినత స్టాలిన్‌తో చర్చలు జరుపుతారు. జేడీఎస్ ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా ఉంటామని.. ప్రకటించింది. స్టాలిన్.. చంద్రబాబు ప్రయత్నాలకు ట్విట్టర్లో మద్దతు పలికారు. తానూ కలసి వస్తానన్నారు. ఇప్పుడు చంద్రబాబు నేరుగా వెళ్లి సమావేశమై..భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.
చంద్రబాబు నాయుడుకు ప్రతిపాదిన సేవ్ నేషన్ కూటమి ప్రయత్నాలకు ఈ ఉపఎన్నికల ఫలితాలు… మరింత బలాన్నివ్వబోతున్నాయి. బీజేపీని ఢీకొట్టడానికి బలం సరిపోదేమో అని వెనకుడుగు వేసేవారికి.. కూటమి కడితే.. బీజేపీ తట్టుకోలేదనే అంశాన్ని ఉపఎన్నికల ఫలితాలు కళ్ల ముందు ఉంచాయి. కూటములుగా పోటీ చేస్తే గతంలోనూ… విపక్షాలు బీజేపీపై ఘన విజయాలు సాధించాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో.. ఓట్లు చీలిపోయి… బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ పరిస్థితిని అంచనా వేసుకున్న కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ … చేతులు కలిపాయి. ఫలితంగా… యూపీలో వరుసగా జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి షాకుల మీద షాకులు తలుగుతూ వస్తున్నాయి. మిత్రపక్షాలు ఐక్యంగా పోరాడిన చోటల్లా బీజేపీ ఓడిపోయింది. విడివిడిగా పోటీ చేసిన చోట… గెలిచింది. ఇటీవలి కాలంలో ఉపఎన్నికలు దాదాపుగా ప్రతి కీలక రాష్ట్రంలోనూ జరిగాయి. పంజాబ్ నుంచి కర్ణాటక వరకూ ప్రజాభిప్రాయం వెల్లడయింది. అదే సమయంలో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ.. జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలయింది.
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని కాకూడదన్న లక్ష్యంతో చంద్రబాబు జాతీయ మహాకూటమి తానే లీడ్ తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ఢిల్లీ పర్యటన జరిపి… బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారినందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ లేకుండా.. బీజేపీని ఓడించడం అనేది ప్రజలకు నమ్మశక్యం కాని ఫార్మాలా అవుతుంది కాబట్టి… చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆలోచించారు. కాంగ్రెస్ పార్టీని కూడా కూటమిలో భాగస్వామ్యం చేస్తున్నారు. దానికి రాహుల్ గాంధీ అంగీకరించారు. ప్రధాని అభ్యర్థి అన్న మాట లేకుండా.. మొదటి లక్ష్యం అయిన బీజేపీని ఓడించడాన్ని సాధించడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఎవరూ మోదీ మళ్లీ వస్తారని భావించడం లేదు. అందుకే.. తిరగబడుతున్నారు.