హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ వీసీగా ఇటీవల నియమితులైన విపిన్ శ్రీవాత్సవకు ఇవాళ చేదు అనుభవం ఎదురయింది. వేముల రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని, వీసీ అప్పారావును తొలగించాలని తదితర డిమాండ్లతో అతని సహచరులు క్యాంపస్లో నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ఛార్జ్ వీసీ విపిన్ శ్రీవాత్సవ ఏమనుకున్నారో ఏమో గానీ ఇవాళ ఉన్నట్లుండి విద్యార్థుల శిబిరం వద్దకు వెళ్ళారు. చర్చలకు రావాలని ఆహ్వానించారు. అసలు సస్పెన్షన్కు సిఫార్సు చేసిన వ్యక్తినే ఇన్ఛార్జ్ వీసీగా నియమించటంపై తామంతా ఆగ్రహంతో ఉండగా, వివాదం మొత్తానికి కారణమైన విపిన్ శ్రీవాత్సవ వచ్చి ఏమీ ఎరగని అమాయకుడిలాగా చర్చలకు ఆహ్వానించటం చూసి విద్యార్థులకు అరికాలి మంట నెత్తికెక్కింది. వీసీ గోబ్యాక్ అంటూ వెంటబడి నినాదాలు చేశారు. దానితో విపిన్ శ్రీవాత్సవ పలాయనం చిత్తగించారు. పోలీసులు ఆయనను తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి అక్కడనుంచి పంపేశారు. గతంలో దళిత విద్యార్థులపట్ల అమానుషంగా ప్రవర్తించిన వీసీ ఇప్పుడు ఎలా న్యాయం చేయగలరని ఆందోళనకారులు ప్రశ్నించారు.