కాంగ్రెస్ పార్టీ కేటాయించిన స్థానాలపై… తెలుగుదేశం పార్టీలోనూ అసంతృప్తి ఉంది. ఈ రోజు తెలంగాణ తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. సుమారు గంటసేపు జరిగిన చర్చల్లో తెలంగాణలో కాంగ్రెస్ కేటాయించాల్సిన స్థానాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. జూబ్లీహిల్స్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, కొత్త గూడెం, కోదాడ నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీకి కేటాయించాల్సిందిగా పట్టుబట్టాలని చంద్రబాబును కోరారు. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలలో గెలుపొందిన నియోజకవర్గాలను వదులుకోవద్దని పలువురు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు చంద్రబాబుకు సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కు ఇవ్వొద్దని కోరుతూ కొంత మంది కార్యకర్తలు చంద్రబాబు పాదాలపై పడినంత పని చేశారు. అనుకోని పరిణామానికి బిత్తరపోయిన చంద్రబాబు కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చే లీకులను పరిగణలోకి తీసుకుని ఆందోళనకు గురి కావద్దని నేతలు కార్యకర్తలకు హితవు చెప్పారు. జూబ్లీహిల్స్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని నేతలు పట్టుబట్టారు. దివంగత పి.జనార్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఆయన కుమారుడ్ని పంపి… జూబ్లిహిల్స్ ను టీడీపీ తీసుకోవాలని టీ టీడీపీ నేతలంటున్నారు. తాము కాంగ్రెస్ ప్రతిపాదించిన 14స్థానాల్లో కాకుండా ఎక్కువ స్థానాలు తమకు కేటాయించాలని కాంగ్రెస్ తో కూడా మాట్లాడాలని చంద్రబాబును కోరిన విషయం వాస్తవమేనని టీ టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీయేతర కూటమి ప్రభావం తెలంగాణా ఎన్నికలపై ఉంటుందని, మోడీతో ఢీ కొట్టడం వల్ల తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో అనుకూలతను తీసుకువస్తుందని నేతలు చంద్రబాబుకు చెప్పారు.
ఎక్కడైనా అభ్యర్దులకు టిక్కెట్లు కేటాయించలేని పక్షంలో అసంతృప్తికి గురైన వారితో తాను నేరుగా మాట్లాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం నేతలకు హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం తెలంగాణా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో కిక్కిరిసింది. సుమారు వేయి మంది కార్యకర్తలు, నేతలు చంద్రబాబు నివాసానికి తరలి వచ్చారు. కేసీఆర్ అన్నకూతురు రమ్యారావు కూడా.. చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.