Kartha Karma Kriya Movie Review
రేటింగ్: 1.5
ఈతరం ప్రేక్షకుడికి ఓపిక చాలా తక్కువ. పదినిమిషాల అద్భుతమైన ఎపిసోడ్ తరవాత… కథని రెండు నిమిషాలు సాగదీస్తే.. వెంటనే సెల్ఫోన్లో తల దూర్చేస్తున్నాడు. అందుకే కమర్షియల్ సినిమాలకూ పాటలు భారమైపోతున్నాయి. అసలు సినిమాలకు పాటలు అవసరమా? అనే చర్చ సాగుతోందంటే – ప్రేక్షకుడ్ని మెప్పించడం ఎంత కష్టమో ఆలోచించండి. థ్రిల్లర్ సినిమాలకు ఈ కష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. థ్రిల్లర్ అంటేనే… అనుక్షణం ఉత్కంఠత రేపేలా ఉండాలి. అందులో సుత్తి, సోది.. లాంటి విషయాలకు అస్సలు చోటివ్వకూడదు. కొత్తవాళ్లతో, ఓ కొత్త దర్శకుడు ఓ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం మరింత కొత్తగా ఉండాలి. `కర్మ కర్మ క్రియ` కూడా ఓ థ్రిల్లర్ కథే. పూర్తిగా కొత్తవాళ్లతో చేసిన సినిమా. మరి ఇది థ్రిల్ ఇచ్చిందా? ఈ కథలో కర్త, కర్మ, క్రియ ఎవరు?
* కథ
హైదరాబాద్ నగరంలో మూడు ఆత్మహత్యలు చోటు చేసుకుంటాయి. ముగ్గురూ మహిళలే. `నా చావుకి ఎవరూ కారణం కాదు` అని సూసైడ్ నోట్ రాసుకుని మరీ చనిపోతాడు. పోలీసులు కూడా ఇవి ఆత్మహత్యలే అని నిర్థారిస్తారు. అయితే… ఇవి ఆత్మహత్యలా? లేదంటే.. ఈ చావుల వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ ఇనస్పెక్టర్ రవితేజ (రవి వర్మ) మళ్లీ విచారణ ప్రారంభిస్తాడు. ఆ విచారణలో తేలిన నిజాలేంటి? ఈ మరణాల వెనుక కారణమేంటి? అనేదే కథ.
* విశ్లేషణ
థ్రిల్లర్ సినిమాలు తీయడం చాలా ఈజీ అనుకుంటారు. కానీ అదో సవాల్. టార్గెట్ ఆడియన్స్ ని సంతృప్తిపరచడం తలకు మించిన పని. కథ పక్కదారి పట్టడానికి ఆస్కారం ఇవ్వకూడదు. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుడిలో అనేక ప్రశ్నలు లేవదీసి, వాటికి ఊహించని రీతిలో సమాధానాలు ఇవ్వాలి. మర్డర్ మిస్టరీల్లో ఈ సూత్రం మరింత ప్రధానమైనది. తెరపై దర్శకుడు కథ చెబుతున్నప్పుడు చాలా పాత్రలపై అనుమానాలొస్తాయి. అయితే `వీళ్లెవరూ కాదు… ` అంటూ కొత్త పాత్రని రంగంలోకి దింపి షాక్ ఇస్తుంటారు దర్శకుడు. అలాంటి ఫార్మెట్లు చాలాసార్లు విజయం సాధించాయి కూడా. `కర్త కర్మ క్రియ` కథలోనూ నాలుగు పాత్రలపై అనుమానం ఏర్పడేలా చేశాడు దర్శకుడు. `వీళ్లు కాకుండా వేరేవాళ్లెవరో ఉంటారేమో` అనుకుంటే… ఆ కథని వాళ్ల చుట్టూనే తిప్పి, ఆ అనుమానితుల్లోనే నేరస్థుడ్ని పట్టుకునేలా చేశాడు. ఓ విధంగా నేరస్తుడు ఎవడన్న విషయంలో దర్శకుడు ముందే క్లూ ఇచ్చేశాడన్నమాట.
ఈ కథని సింపుల్‌గా ఇలానే చెప్పేస్తే పది నిమిషాల్లో తేలిపోతుంది. అందుకే… హీరో, అతని ఫ్రెండు… వాళ్ల మధ్య మందు సీన్లు, లవ్ ట్రాకు.. పాటలు – ఇలాంటివి నడుపుతూ విశ్రాంతి వరకూ కాలక్షేపం చేశాడు. థ్రిల్లర్ సినిమాలకు సెకండాఫ్ చాలా కీలకం. అలాగని తొలి సగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. లవ్ ట్రాక్, ఫ్రెండ్ ఎపిసోడ్ … వీటిని వీలైనంత కొత్తగా తీసి, ప్రేక్షకుడ్ని ఎంగేజ్ చేయాలి. ఈ విషయంలో దర్శకుడు విఫలమయ్యాడు. `అసలు కథలోకి ఎప్పుడు వెళ్తాడ్రా బాబూ..` అనుకునేలా చేశాడు. సెకండాఫ్ కూడా ఏం సాఫీగా సాగలేదు. చెప్పాలనుకన్న పాయింట్ చాలా చిన్నది. అది చెప్పేస్తే సినిమా ఎక్కడ అయిపోతుందేమో అనుకుని.. అక్కడక్కడే దాన్ని రంగుల రాట్నంలా తిప్పుతూ వెళ్లాడు. ఇన్వెస్టిగేషన్ పేరుతో కాలయాపన చేశాడు. హంతకుడు ఎవరన్నది ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. దాని కోసం పోలీసులు తలలు బాదుకుంటుంటారు. కథ ఓ పక్క సీరియెస్ గా సాగుతోంటే (కనీసం దర్శకుడి మైండ్‌లో) హీరో, హీరోయిన్లని గోవా తీసుకెళ్లి ఓ పాటేసుకుని వస్తాడు దర్శకుడు. సెకండాఫ్‌లో కథానాయకుడ్ని పక్కన పెట్టేసి రవితేజ (రవివర్మ) పాత్రని హైలెట్ చేసుకుంటూ వెళ్లాడు. దాంతో ఈ సినిమాలో హీరో ఎవరు? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.
* నటీనటులు
హీరో, హీరోయిన్లు ఇద్దరూ కొత్తవారే. హీరోలో.. హీరో మెటీరియల్, హీరోయిన్లో హీరోయిన్ మెటీరియల్ రెండూ కనిపించవు. రవివర్మ ఒక్కడే అనుభవజ్ఞుడు. హీరోలా తన పాత్రకూ.. బిల్డప్ షాట్లు ఎక్కువయ్యాయి. కాదంబరి కిరణ్, కాశీవిశ్వనాథ్ లవి చిన్న పాత్రలే. జేపీ కూడా చేసిందేం లేదు.
* సాంకేతిక వర్గం
థ్రిల్లర్ కథలో నమ్ముకోవాల్సింది మలుపులనే. అవి ఈ సినిమాలో కొరవడ్డాయి. ఓ పాయింట్‌ని అటు తిప్పి ఇటు తిప్పి… ఎలాగైనా సరే ఆసక్తిగా చెప్పగలగాలి. ఆ స్క్రీన్ ప్లే ఇందులో కొరవడింది. ఈ సినిమా ఇలా వచ్చిందంటే.. దానికి కర్త, కర్మ, క్రియ మూడూ దర్శకుడే. సరైన కథని, సరైన విధంగా ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యాడు. కెమెరా వర్క్, సంగీతం, పాటలు ఇవి మూడూ దానికి తగ్గట్టే సాగాయి.
* తీర్పు
పెద్ద సినిమాలకు స్టార్లే బలం. చిన్న సినిమాలకు సర్వం కథే. అలాంటప్పుడు చిన్న దర్శకుడు, నిర్మాతలు మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్న పాయింట్లను పట్టుకుంటే సినిమాలు కావని, ఓ మంచి సినిమా రావాలంటే కర్త కర్మ క్రియ మూడూ కథే అని దర్శకులు గుర్తించాలి. లేకపోతే.. ఫలితాలు ఇలానే ఉంటాయి.
* ఫైనల్ టచ్: థ్రిల్ మిస్సింగ్
రేటింగ్: 1.5