తాను స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నా అన్నారు ప్రజా గాయకుడు గద్దర్. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచే తాను పోటీ చేస్తానని అన్నారు. అయితే, ఇదే విషయాన్ని కొన్ని రోజుల కిందటే గద్దర్ ప్రకటించారు. అందరూ కోరుకుంటే, తనకు మద్దతు ఇస్తే కేసీర్ మీద పోటీకి సిద్ధమని అన్నారు. ఆ నేపథ్యంలో వినిపించిన విశ్లేషణలు ఏంటంటే… గద్దర్ కి మహా కూటమి మద్దతు ఇస్తుందనీ, తద్వారా కేసీఆర్ మీద గద్దర్ చేసే విమర్శల్ని ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకోవచ్చని అన్నారు. ఆ తరువాత, ఒకట్రెండు రోజులు మాత్రమే గద్దర్ ప్రకటనకు ప్రాధాన్యత కనిపించింది.
తనకు మద్దతు ఇవ్వాలంటూ గద్దర్ స్వయంగా కాంగ్రెస్ నుగానీ, మహాకూటమి పక్షాలనుగానీ, లేదా భాజపాని ఆయన కోరలేదు. నిజానికి, ఆయనే అడిగి ఉంటే వీరంతా కచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేది. ఇంకా చెప్పాలంటే.. మహా కూటమి తరఫున కూడా ఆయన్ని బరిలోకి దించే అవకాశాలు కూడా ఉండేవి. మరి, ఈ అవకాశం ఉందని తెలిసినా కూడా గద్దర్ ఎందుకు కాంగ్రెస్ ను సంప్రదించలేదూ అంటే… కారణం తన కుమారుడి సీటు వ్యవహారమే అని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి తన కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపాలని చివరి వరకూ ఆయన ప్రయత్నించినట్టు సమాచారం. అయితే, ఆయన ప్రయత్నాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోలేకపోయిందనీ, ఇప్పటికే ఆశావహుల తాకిడి ఎక్కువ కావడంతో టికెట్ విషయాన్ని పక్కన పెట్టేసినట్టు సమాచారం. దీంతో గద్దర్ కాంగ్రెస్ మీద కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంకోటి.. గద్దర్ తాను గజ్వేల్ నుంచి మాత్రమే పోటీ చేస్తాను అనడంతో… ఆయన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చెయ్యలేదనీ చెప్పుకోవచ్చు! గజ్వేల్ నుంచి ఆ పార్టీ తరఫున ప్రతాప రెడ్డి బలమైన నాయకుడిగా ఉన్నారనీ, ఆయనతో పోల్చుకుంటే గద్దర్ ప్రభావం వాస్తవ రూపంలో క్షేత్రస్థాయిలో పెద్దగా ఉండకపోవచ్చనే అభిప్రాయం కూడా కాంగ్రెస్ లో వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ప్రజా గాయకుడిగా గద్దర్ కి పేరుంటే అది ప్రచారానికి పనికొస్తుందనీ, ఓటింగ్ దగ్గరకి వచ్చేసరికి పరిస్థితి మరోలా ఉంటుందనేదీ ఆ పార్టీ లెక్కగా తెలుస్తోంది! మొత్తానికి, ఏదైతేనేం… గద్దర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. కానీ, మహా కూటమి నుంచి ఆయనకు ఇప్పుడు మద్దతు అందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టే లెక్క.