హైదరాబాద్: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్యనాయుడు అమెరికాలోని డెట్రాయిట్లో జరుగుతున్న తానా 20వ మహాసభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న ప్రవాస తెలుగువారినుద్దేశించి ఆయన అద్భుత ప్రసంగం చేశారు. మనిషి చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకోవటం సరికాదని, సాటివారికి సాయపడుతుండాలని అన్నారు. మన గ్రామంవారికోసం, మన జిల్లావారికోసం, మన రాష్ట్రంవారికోసం, మన దేశంవారికోసం, చివరగా వీలైతే ప్రపంచంలోని అందరికోసం మనవంతు కర్తవ్యంగా ఎంతోకొంత చేయగలిగితే మన జీవితం సార్థకమవుతుందని చెప్పారు. తానా చేస్తున్న సేవలను ప్రశంశించారు. మహాసభలలో చిన్న పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తననెంతో ఆకట్టుకున్నాయని, అద్భుతంగా ఉన్నాయని అన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వం ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని చెప్పారు. మన సంప్రదాయాలలోని శాస్త్రీయతను వివరించారు. ఇళ్ళముందు జల్లే కళ్ళాపి దగ్గరనుంచి మన ప్రతి సంప్రదాయంవెనుకా నిగూడార్థం ఉందని చెప్పారు.
మహాసభలలో నటులు వెంకటేష్, నిఖిల్, నవదీప్, అల్లరి నరేష్, హీరోయిన్లు తాప్సి, రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు రాఘవేంద్రరావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ, ఏపీ స్పీకర్ కోడెల, మంత్రులు కామినేని, అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు. మరోవైపు లాస్ఏంజల్స్లో నాట్స్ సభలు నిన్న ప్రారంభమయ్యాయి. నటుడు బాలకృష్ణ, పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు, హైకోర్టు న్యాయమూర్తి నూతి రామమోహనరావు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి తదితరులు పాల్గొన్నారు.