ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. 11వ తేదీన రెండు ఖాళీల భర్తీతోపాటు కొన్ని శాఖల్లో మార్పులు ఉండే అవకాశం ఉందనే చర్చా ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు మహా అయితే ఆర్నెల్లు మాత్రమే ఉన్న తరుణంలో… ఇప్పటికిప్పుడు మార్పుల వల్ల కొత్తగా సాధించేదంటూ ఏదీ ఉండదనే చెప్పాలి. సరే, భర్తీ కాబోతున్న ఆ రెండు ఖాళీల కోసమైనా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అమరావతికి రావాల్సి ఉంటుంది. కొత్త మంత్రులతో ఆయనే ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ ఒకే వేదికను పంచుకోవాల్సి ఉంటుంది! ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఓరకంగా ఇది ఆసక్తికరమైన అంశమే.
ఎందుకంటే, విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీద కోడి కత్తి దాడి జరిగిన తరువాత… చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాల కోసం నేరుగా తనను సంప్రదించకుండా, పోలీసు ఉన్నతాధికారులతో గవర్నర్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనీ, ఆయనకు ఎందుకంత ఉత్సుకత అనీ చంద్రబాబు నాయుడు నిలదీసిన సంగతి తెలిసిందే. నిజానికి, గవర్నర్ తీరుపై ఆ ఘటనకు ముందు కూడా టీడీపీ నేతలు కొన్ని విమర్శలు చేస్తుండేవారు. కానీ, విశాఖ ఘటన తరువాత ముఖ్యమంత్రి స్వయంగా, నేరుగా నరసింహన్ పై విమర్శలు చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంలోనూ, అక్కడ కూడా జాతీయ మీడియాతో గవర్నర్ వ్యవస్థ తీరుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ లను కేంద్రంలోని అధికార పార్టీ తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటోందనీ అన్నారు.
దీంతో నరసింహన్, చంద్రబాబు నాయుడు మధ్య ఒక రకమైన వాతావరణం ఈ మధ్య ఏర్పడ్డట్టయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్, ముఖ్యమంత్రి ఒకే వేదిక మీద… పక్కపక్కన కూర్చోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో సహజంగానే కొంత ఆసక్తి నెలకొంటుంది. ఇప్పుడీ ఇద్దరూ తటస్థంగా ఉండిపోతారా, లేదా ఈ సందర్భంగా గవర్నర్ ఏదైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందా అనేది కొంత ఆసక్తి నెలకొంది. ఇద్దరి మధ్యా ఏమీ జరగనట్టుగా వ్యవహరిస్తారా, లేదంటే ఎవరికి వారు దొరికిన సందర్భాన్ని వినియోగించుకుని పరోక్షంగా వ్యాఖ్యానించుకునే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాలి.