24 గంటల క్రితం విడుదలైన `వినయ విధేయ రామా` టీజర్ కి మిశ్రమ స్పందన వచ్చింది. మెగా ఫ్యాన్స్‌కి చరణ్ వీరోచిత విన్యాసాలు బాగా నచ్చేసినా… మిగిలినవాళ్లు మాత్రం ఇది `రోటీనే కదా` అంటున్నారు. సింహా, లెజెండ్, సరైనోడు, జయ జానకీ నాయక టీజర్లతో పోలుస్తున్నారు. హింస మితిమీరిపోయిందని, టైటిల్‌కీ, టీజర్‌కి సంబంధమే లేదని.. నొసలు చిట్లిస్తున్నారు. ఏదేమైనా.. `వినయ విధేయ రామా` 24 గంటల్లో 15 మిలియన్ల డిజిటల్ వ్యూస్‌ని సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందమే ప్రకటించింది. 24 గంటల్లో 15 మిలియన్ల వ్యూస్ అంటే.. గొప్ప విషయమే. కాకపోతే ఒక్కటే అనుమానం. ఇన్ని వ్యూస్ వచ్చిన టీజర్ కచ్చితంగా యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో ఉండాలి. కానీ టాప్ 10లో ఎక్కడా `వినయ విధేయ రామా` కనిపించడం లేదు. నిన్ననే విడుదలైన `కేజీఎఫ్` అనే డబ్బింగ్ సినిమా కూడా ట్రెండింగ్‌లో చోటు దక్కించుకుంది. చరణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇన్ని మిలియన్స్ అని చెప్పుకుంటున్న టీజర్ కచ్చితంగా టాప్ 3లో ఉండాలి. కానీ.. టాప్ 20లో కూడా ఈ టీజర్‌కి స్థానం దక్కలేదు. మరి ఈ వ్యూస్‌లో మతలబేంటో.. చిత్రబృందానికే తెలియాలి.