హైదరాబాద్: ప్రపంచంలో ప్రతిరోజూ వందలకోట్లమంది వాడే ఫేస్బుక్ అనే బ్రహ్మాండమైన ప్రోడక్ట్‌ను ఆయన రూపొందించారు. ఆయన ఆస్తులు బిలియన్లలో ఉంటాయి. మరెన్నో బిలియన్లను సమాజసేవకు ఇచ్చేస్తుంటారు. అలాంటి శ్రీమంతుడు మార్క్ జ్యుకర్‌బర్గ్ తలుచుకుంటే ప్రతిరోజూ ఒక కొత్త డ్రస్ వేసుకోవచ్చు. కానీ రోజువారీగా ఆయన వేసుకునే డ్రస్ మాత్రం ఒక్కటే రకం. గ్రే కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ జీన్స్. అంటే ఒకే డ్రస్‌ను వేసుకుంటారని కాదు. ఆయన వార్డ్రోబ్ నిండా ఒకే రంగు షర్ట్లు, ఒకే రంగు జీన్స్ ఉంటాయి. ఏదైనా ముఖ్య కార్యక్రమాలకు, పార్టీలకు అయితే బ్లూ కలర్ సూట్ ధరిస్తారు. చలికాలంలో మాత్రం రోజువారి డ్రస్‌లో కొద్ది మార్పు ఉంటుంది. చలి బాగా ఉన్నపుడు టీ షర్ట్ పైన హుడ్ ఉన్న బ్లాక్ జాకెట్ ధరిస్తారు.
మార్క్ ఒక్కరే కాదు చాలా మంది ప్రముఖులలో ఈ ధోరణి కనిపిస్తుంటుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎక్కువగా వైట్ షర్ట్-బ్లాక్ సూట్ ధరిస్తారు. దీనిపై ఒక విలేకరి అడగగా, తాను గ్రే లేదా బ్లూ సూట్స్ మాత్రమే ధరిస్తానని ఒబామా చెప్పారు. తినటం, డ్రస్సింగ్ వంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం తనకు ఇష్టముండదని అన్నారు. తాను ఇంకా అనేక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిఉంటుందని చెప్పారు. యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ కూడా డ్రస్సింగ్ విషయంలో ఇదే ధోరణి అవలంబించేవారు. ప్రతి రోజూ బ్లూ కలర్ టర్టిల్ నెక్ స్వెటర్, బ్లూ జీన్స్‌నే ధరించేవారు. ఎంతో అందమైన యాపిల్ ఉత్పత్తులకు రూపకల్పన చేసిన స్టీవ్ తన వస్త్ర ధారణ విషయంలో మాత్రం ఒకే రంగుతో సరిపుచ్చుకోవటం విచిత్రంగా కనిపిస్తుంది.
మన రాజకీయ ప్రముఖులలో చూస్తే అందరూ వైట్ అండ్ వైట్ డ్రస్నే ఎక్కువ ధరిస్తారు. ఒకరకంగా అది రాజకీయ నాయకులకు యూనిఫామ్ అయిపోయింది. చంద్రబాబు కాస్త డిఫరెంట్‌గా గోధుమరంగు డ్రస్ ధరిస్తూ ఉంటారు. జగన్ ఈ రెండు రంగులూ కాకుండా స్కై బ్లూ కలర్ షర్ట్‌లో ఎక్కువగా కనబడతారు. కేటీఆర్ కూడా వైట్ షర్ట్‌నే ధరిస్తున్నారు. సినీ ప్రముఖులలో మహేష్ ఆడియో ఫంక్షన్లకు ఎక్కువగా డార్క్ బ్లూ కలర్ షర్ట్‌నే ధరించి హాజరవుతుంటారు.
ఇలా ఒకే డ్రస్ వేసుకోవటానికి ప్రాధాన్యతల నిర్ణయమే(ప్రయారిటైజింగ్) కారణంగా విశ్లేషిస్తున్నారు సైకాలజిస్టులు. అంతిమ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించటంవలన వీరు చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వరని అంటున్నారు. మరోవైపు డ్రస్సింగ్ వంటి విషయాలపై ఆలోచించటానికి, మైండ్ పెట్టటానికి ఇష్టంలేక ఇలా ఒకే డ్రస్ వేసుకునేవారు కూడా ఉంటారని చెబుతున్నారు.