జగన్ పై దాడి కేసు విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. అయితే దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటి దాకా, జగన్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఈ దాడి పై ఎవరూ స్పందించలేదు. కేవలం పార్టీ నాయకులు మాత్రమే పార్టీ తరఫున స్పందించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రేపు విజయమ్మ మీడియా ముందుకు వచ్చి ఈ విషయమై మాట్లాడనున్నారు. ఆవిడ తో పాటు జగన్ కుటుంబ సభ్యులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే రేపు విజయమ్మ ఏం మాట్లాడనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జగన్ పై దాడి విషయంలో, కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలన్న జగన్ పిటిషన్ కు కోర్టు సానుకూలంగా స్పందించలేదు. ముందు రాష్ట్ర విచారణ బృందానికి సహకరించి, అప్పటికీ విచారణ జరుగుతున్న తీరు సరిగా లేకపోతే అప్పుడు ఇలా కోరవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇక ఈ దాడి విషయంలో రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు తారస్థాయికి చేరాయి. ఒకానొక సందర్భంలో టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ నోరు జారి, ఈ దాడి వెనుక విజయమ్మే ఉందని వ్యాఖ్యానించిన విషయం, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బాబు రాజేంద్రప్రసాద్ ని తీవ్రంగా మందలించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో, విజయమ్మ రేపు ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. అదే సమయంలో, ఇప్పటిదాకా ఇటు జగన్ కానీ అటు జగన్ కుటుంబ సభ్యులు కానీ ఈ సంఘటనపై ఎందుకు మీడియాతో స్పందించలేదని ప్రజలలో కూడా కాస్త గందరగోళం ఉంది . వీటన్నింటికీ రేపు సమాధానాలు దొరుకుతాయా లేక పార్టీ నాయకులు చేస్తున్న స్టేట్మెంట్లనే విజయమ్మ కూడా కాస్త అటూ ఇటూ మార్చి ఇస్తుందా అన్నది తెలియాలంటే రేపటి దాకా ఆగాలి.