ఇబ్రహీంపట్నంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకునే మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలోని నీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారన్నారు. ఈ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలనీ, కేసీఆర్ చేతిని పట్టుకుని నడిస్తే అభివృద్ధి జరుగుతుందా, చంద్రబాబు వేలు పట్టి వెళ్తే మంచి జరుగుతుందా అనేది చెప్పాలన్నారు. ఈ సందర్భంగా టీడీపీకి తాను వేసిన 19 ప్రశ్నల గురించి ప్రస్థావించారు.
తాను అడిగిన ప్రశ్నలకు టీడీపీ నుంచి జవాబులు రాలేదనీ, కానీ తనపై లేనిపోనివి వారు మాట్లాడుతున్నారు అన్నారు హరీష్ రావు. ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ప్రజా ప్రతినిధిగా ఈ రాష్ట్ర రైతుల గుండెల్లో ఏది ఉంటే అదే అడిగానన్నారు. మీకు చేతనైతే చంద్రబాబుతో తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మెప్పు కోసమే హరీష్ ఇలా చేస్తున్నారని ఒకాయన అంటున్నారన్నారు. తాను ఇవాళ్ల కొత్తగా మాట్లాడటం లేదనీ, తాను కేసీఆర్ నాయకత్వంలో ఎదిగాననీ, ఉద్యమాల నుంచి వచ్చాననీ, పదవుల్ని తృణప్రాయంగా రాజీనామాలు చేశాను అన్నారు. తనను ఎంత తిడితే అంత గట్టిగా పనిచేస్తానన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తాను పనిచేస్తానని మరోసారి కూడా చెప్పారు.
మంత్రి హరీష్ రావు ఇలా వివరణ ఇచ్చుకునే పరిస్థితి తీసుకుని రావడంలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా సక్సెస్ అయిందనే అనిపిస్తోంది. ఆయన చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటే, ఆధిపత్య పోరు అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చి, తెరాస కారు డ్రైవర్ ని మార్చే పని హరీష్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శల దాడికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఆయనకి ఎదురైంది. ఈ మద్య ఏ ప్రెస్ మీట్ పెట్టినా, సభల్లో పాల్గొంటున్నా… ‘కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నా’ అని పదేపదే చెప్పుకుంటున్న తీరు గమనార్హం. ఆయన్ని తమవైపు డైవర్ట్ చేసుకోవడంలో కాంగ్రెస్ ఆరోపణల వ్యూహం వర్కౌట్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు.